ఇయ్యాల్టి నుంచి గ్రామ సభలు

 ఇయ్యాల్టి నుంచి  గ్రామ సభలు
  • లబ్దిదారుల ఎంపిక కోసం కసరత్తు 
  •  స్కీముల ఫీల్డ్ సర్వే కంప్లీట్ 
  •  లిస్ట్​లపై అభ్యంతరాల స్వీకరణ
  •  కొత్తగా అప్లికేషన్లకు అవకాశం
  •  విలేజ్​కొక ఇన్​చార్జి ఆఫీసర్​ 

నిజామాబాద్/ కామారెడ్డి , వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న నాలుగు వెల్ఫేర్​ స్కీంల లబ్డిదారుల ఎంపికకు సంబంధించిఫీల్డ్​ సర్వే పూర్తయ్యింది. గతంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వారి ఇండ్లకు వెళ్లి సర్వే బృందాలు వివరాలు తీసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్కీమ్​ల ద్వారా లబ్ది పొందేందుకు అర్హతలున్న వారి జాబితా తయారు చేసి అధికారులకు అందజేశారు. ఇవాల్టి నుంచి గ్రామ, వార్డు స్థాయిలో నిర్వహించే సభల్లో ఈ జాబితాలను బహిరంగంగా చదివి వినిపిస్తారు. 

ఈ లిస్ట్​లో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరిస్తారు. ఇందుకోసం ఇంచార్జి అధికారులను నియమించారు. గ్రామాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో విలేజ్​ సెక్రటరీ, ఆర్​ఐ, ఏఈవో, ఏవోల టీం అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు ఆయా పథకాల కోసం ఇంకా ఎవరైనా అప్లికేషన్లు ఇస్తే తీసుకుంటారు. 

అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదించి ఈ నెల 26 లోగా లబ్దిదారుల ఫైనల్​ లిస్ట్​తయారు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదించిన జాబితాల ప్రకారమే రేషన్​కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. రైతుభరోసా, ఇందిరమ్ ఆత్మీయ భరోసా స్కీమ్​కింద ఆర్థిక సాయం అందజేస్తారు. గ్రామసభల్లో ప్రజలకు తాగునీరులాంటి వసతులు కల్పించాలని, టెంట్ తదితర ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. 

సాగు చేయని భూమి 17 వేల ఎకరాలు 

రైతుబంధు పేరుతో ఇది వరకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా కాంగ్రెస్​ సర్కారు దాన్ని రైతు భరోసా పేరిట రూ.12 వేలకు పెంచింది. పంట పెట్టుబడి అవసరాల కోసం రైతులకిచ్చే ఈ స్కీమ్​ను సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో గుట్టలు, పుట్టలు, రాళ్లు, రప్పలున్న ల్యాండ్​ను ఫీల్డ్​ సర్వే చేసి అగ్రికల్చర్​ ఆఫీసర్లు తొలగించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 17 వేల ఎకరాలను సాగుకు వినియోగించడంలేదని గుర్తించారు. నిజామాబాద్​ నగర శివారులో రియల్​ ఎస్టేట్​ చేస్తున్న భూములు తీసేశారు. 

నిజామాబాద్​ జిల్లాలోని 5,42,838 ఎకరాల్లో సాగుకు యోగ్యం కాని భూమి 8,575 ఎకరాలున్నట్టు ఫీల్డ్​ సర్వేలో గుర్తించి తొలగించారు. కామారెడ్డి జిల్లాలో 5,24,000 ఎకరాల భూమిలో సాగు యోగ్యం కాని భూములు 8,500 ఎకరాలున్నట్లు తేల్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని కూలీలకు ఏటా రూ.12 వేలు ఇవ్వడానికి అర్హుల సెలెక్షన్​ పూర్తి చేశారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి 2023–24లో కనీసం 20 రోజులు పని చేసిన రికార్డు ప్రామాణికంగా లబ్ధిదారులను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో ఆ రకంగా లక్ష మంది ఉండగా 25,501 మందికి భూమి లేనట్లు తేల్చారు. ఈ లిస్టును గ్రామసభలో ఫైనల్ చేస్తారు.

జాగాలున్నవారికే ఫస్ట్​ ప్రయారిటీ 

ప్రజాపాలనలో నిజామాబాద్​ జిల్లాలో ఇండ్ల కోసం 3,32,663 మంది అప్లికేషన్​లు పెట్టారు. కామారెడ్డిలో 2,38,682 దరఖాస్తులు అందాయి. వాటి ఆధారంగా ఫీల్డ్​ సర్వే చేపట్టిన బృందాలు సొంత జాగాలున్న అర్హులను గుర్తించి జాబితా రూపొందించారు. ఆ పేర్లు గ్రామ సభలో చదువనున్నారు. మిస్​ అయిన పేర్లు ఉంటే అక్కడే దరఖాస్తు తీసుకుంటారు.

ALSO READ : గ్రంథాలయాలతోనే సమాజంలో మార్పు : మంత్రి జూపల్లి కృష్ణారావు 

గతంలో అప్లయ్ చేసిన వ్యక్తులు సర్వేకు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవటంతో ఇవి పెండింగ్​లో ఉన్నాయి. దివ్యాంగులు, పంచాయతీ కార్మికులు, ఇండ్లు లేని నిరుపేదలకు ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వనున్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం నిజామాబాద్​ జిల్లాలో 32 వేలు, కామారెడ్డిలో 21,849 అప్లికేషన్లు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే సేకరించిన సమాచారం ఆధారంగా ఫీల్ట్​సర్వే జరిగింది. ఈ లిస్ట్​ను కూడా గ్రామ సభల్లో ప్రకటిస్తారు. 

 గ్రామ, వార్డు సభలపై విస్తృత ప్రచారం చేయాలి

21 నుంచి 24 వరకు జరిగే గ్రామ,వార్డు సభల గురించి యంత్రాంగం విస్తృత ప్రచారం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్, నిజామాబాద్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశించారు. ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల లిస్టును సభల్లో వివరించి అమోదం పొందాలని అభ్యంతరాలు, అక్షేపణలు ఉంటే చర్చించాలన్నారు. ఆయా పథకాలకు కొత్తగా అప్లికేషన్లను స్వీకరించాలన్నారు. 

విలేజ్​/వార్డు సభల వివరాలు

నిజామాబాద్​ కార్పొరేషన్​, బోధన్​, ఆర్మూర్, భీంగల్​ మున్సిపాలిటీ వార్డులు: 154

విలేజ్​లు: 545

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు 80 వార్డులు

విలేజ్​లు: 535