ఇంకెన్నాళ్లకు పసుపు బోర్డు..ఆర్మూర్ రైతన్న ఆక్రోశం

పట్టెడన్నం పెట్టే రైతన్న పుట్టెడు దు:ఖంతో బతుకు వెళ్లదీస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో 75 శాతం వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగం ప్రస్తుతం 55 శాతానికి తగ్గింది. రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామని, స్వామినాథన్ సిఫార్సులను అమలుచేస్తామని మోడీ సర్కారు ఐదేళ్లుగా చెప్పడమే గానీ చేసింది శూన్యం. దేశంలో వంద రకాల పంటలుంటే 23 పంటలకే కనీస మద్దతు ధర ఇస్తోంది. దీర్ఘకాలికంగా నానుతూ వస్తున్న పసుపు బోర్డు సాధనకు నిజామాబాద్‌‌ రైతులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగాల్సి వచ్చింది.

ఏటా లక్షా 74 వేల హెక్టార్ల విస్తీర్ణంలో 8 లక్షల టన్నుల పసుపు దేశంలో ఉత్పత్తవుతోంది. తెలంగాణ ప్రాంతంలో 55 వేల హెక్టార్ల సాగుతో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో పసుపు సాగు జరుగుతుంది. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర క్వింటాల్‌‌కి ఎక్కువలో ఎక్కువ ఆరు వేలు పలుకుతుంది. ఎకరానికి రూ. లక్షా 43 వేలు ఖర్చవుతుంది. ఎకరంలో 16 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.6,000 చొప్పున అమ్మితే రైతుకు రూ.96 వేల ఆదాయమే సమకూరుతుంది. ఈ లెక్కన రైతుకి ఎకరానికి 47 వేల రూపాయలు నష్టం వస్తుంది. దీనికి గిట్టుబాటు ధర కల్పించడమే పరిష్కారం. ఆర్మూర్, జగిత్యాల పసుపు రైతులు ప్రతి సీజన్​లో సుమారు 235 కోట్ల నష్టం చవిచూస్తున్నారు.

పసుపు పరిశోధన కేంద్రం నామమాత్రం

2000 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా కమ్మర్‌‌పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరలేదు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు కాలేదు. సిబ్బంది, శాస్త్రవేత్తలు లేరు. నూతన పసుపు విత్తన రకాలను కనుగొన్నది లేదు. పంటలకు వచ్చే రోగాల విషయంలో ఏ ఒక్క సూచనా అందించిన పాపాన పోలేదు. దీంతోపాటు జిల్లాలోని ధర్పల్లి, వేల్పూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో కూడా ప్రభుత్వం పసుపు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. వందల ఎకరాల్లో ఉన్న ఈ కేంద్రాలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. పసుపు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రాంతంలో పసుపు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తే ఇక్కడి నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎర్రజొన్న పంట

ఆర్మూర్ ఏరియాలో 50 వేల నుంచి 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రైవేట్ కొనుగోలుతో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఎర్రజొన్నలను కొనడానికి ప్రభుత్వం నిరాకరించడంతో 40 మంది దళారులు సిండికేట్‌‌గా ఏర్పడి ఇష్టానుసారం ధర తగ్గించేశారు. క్వింటాల్‌‌కి రూ.1,600 చొప్పున కొనుగోలు జరపడమే కాక క్వింటాల్‌‌కి 7–8 కిలోల తరుగు తీశారు. ఈ సంవత్సరం ఎర్రజొన్న రైతులకు తరుగుతో కలిపి క్వింటాల్‌‌కి రూ.119 నష్టం వాటిల్లింది. ఈ ఒక్క ఏడాదే సుమారు రూ.100 కోట్లు నష్టపోయారు. ఎర్రజొన్నకు క్వింటాల్ కు రూ.3,500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు క్వింటాల్‌‌కి రూ 15,000 మద్దతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, కాంగ్రెస్ కిసాన్ ఖేడ్ డిమాండ్‌‌ చేస్తోంది.  –వి. ప్రభాకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం, రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్