బెల్టు షాపులకు డిమాండ్​..భారీగా వేలంపాడి దక్కించుకుంటున్న వైనం

భిక్కనూరు మండలం జంగంపల్లిలో 4 వేల మంది జనాభా ఉంటుంది. 2 రోజుల కింద గ్రామంలో బెల్టుషాప్​ నిర్వహణ కోసం వేలం నిర్వహించారు. నలుగురు వ్యక్తులు పోటీపడగా చివరకు ఓ వ్యక్తి ఏడాదికి రూ.19.85 లక్షలు పాడి దక్కించుకున్నాడు. వేలంలో బెల్ట్​షాప్​దక్కించుకున్నవారే అమ్మకాలు జరుపుతారు. ఇదే ఊరిలో గతేడాది రూ.14 లక్షలకు వేలం పాడారు. నిరుడి కంటే ఈ సారి రూ.5.85 లక్షలు ఎక్కువ వచ్చింది. స్థానికులతో పాటు, దగ్గరి ఊళ్ల వాళ్లు వచ్చి ఇక్కడ మందు కొంటుంటారు.

కామారెడ్డి, వెలుగు ; వచ్చేది ఎన్నికల సీజన్. ఇప్పటికే ఊర్లలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఏడాది కాలంలోనే అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు పెరిగే వీలుంది. ఈ అవకాశాన్ని క్యాష్​ చేసుకునేందుకు గ్రామాల్లో బెల్ట్​షాపులను దక్కించుకునేందుకు చాలా మంది తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎంత డబ్బైనా వెచ్చించేందుకు వెనకాడడం లేదు.

కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. 100కుపైగా గ్రామాల్లో 2 వేల నుంచి 3వేలకు పైగా జనాభా ఉంటుంది. మండల కేంద్రాలతో పాటు, పెద్ద గ్రామాల్లో వైన్​షాపులు ఉన్నాయి. మిగతా ఊర్లలో బెల్టు షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. సమీప మండల కేంద్రంలోని వైన్​షాప్​నుంచి మందు తీసుకెళ్లి ఊర్లలోని బెల్టుషాపుల్లో విక్రయిస్తుంటారు. కొన్ని ఊర్లలో రెండు, మూడు షాపుల్లో అమ్మకాలు చేస్తుంటే, కొన్ని చోట్ల ఒకటే షాపులో అమ్మకాలు జరిగేలా స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీలు వేలంపాట నిర్వహిస్తున్నాయి. ఎవరెక్కువ అమౌంట్​చెల్లిస్తే వారికే ఏడాదిపాటు మందు అమ్ముకునేందుకు అనుమతిస్తున్నారు. ఊరిలో అమ్మకాలు జరిగే స్థాయిని బట్టి ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు వేలం పాడుతున్నారు. భిక్కనూరు, సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, మాచారెడ్డి, బిచ్కుంద మండలాల్లోని పలు చోట్ల బెల్టుషాపుల కోసం వేలం పాటలు నిర్వహించారు.

 ఎక్కువ రేట్లకు అమ్మకం 

వేలం పాటలో ఎక్కువ రేట్​కు బెల్టు షాపు దక్కించుకున్న వ్యక్తులు, ఆ డబ్బులను రాబట్టుకునేందుకు ఎక్కువ రేట్​కు మందు అమ్ముతున్నారు. సీసాపై రూ.20 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పెద్ద గ్రామాల్లోని బెల్ట్​షాపుల్లో రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గ్రామ అభివృద్ధికి అమౌంట్​ చెల్లిస్తున్నందున ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతున్నా అడిగేవాళ్లే లేకుండా పోయారు. బెల్టు షాపుల్లో ఇతర స్టేట్​ల నుంచి తెచ్చిన మద్యం కూడా విక్రయిస్తున్నారు. ఇటీవల గోవా కు చెందిన మద్యాన్ని సదాశివ్​నగర్​ మండలం కుప్రియాల్​లో దొరికింది.