నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన క్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రైతుల కోసం రూ.20,164 కోట్లు బడ్జెట్ లో పెడితే..కేవలం ఒక వెయ్యి150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాలు మాట్లాడితే తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు రైతుబంధు ఇస్తూ మిగతా స్కీములను తొలగిస్తున్నారని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఎన్నికల్లో తనపై పోటీ చేసే వాళ్లు ఒక్కో ఓటుకు10 వేలు పంచేలా చేస్తానని అన్నారు. నిరుపేదల పైసలు తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని బేగంపేటలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని గుర్తు చేశారు. రాష్ర్టంలో కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకూ విధుల్లో ఒత్తిడితో పని చేస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భీంగల్ పట్టణంలో బీజేపీ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.