ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదు : ఎంపీ అర్వింద్ 

నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని మోడీకి కనపడకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ మరోసారి కావాలనే ఢిల్లీకి వెళ్తున్నట్లు ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని చెప్పారు. మునుగోడులో నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి మంచి అవకాశం దొరికిందని చెప్పారు. మునుగోడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లాను పట్టించుకోకుండా అక్కడే తిష్టవేశారని మండిపడ్డారు. నిజామాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలె
రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జీల బడ్జెట్ పూర్తిగా కేంద్రానిదే అని చెప్పారు. గోవింద్ పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వచ్చే నెలలో ప్రారంభమవుతుందన్నారు. అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.

బీజేపీకి సంబంధం లేదు
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎంపీ అర్వింద్ చెప్పారు. గడప గడపకు బీజేపీ నినాదంతో  గ్రామాల్లోనూ పర్యటిస్తామన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రచారం చేస్తామన్నారు. జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తలందరూ కలిసే ఉన్నారని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.