జగిత్యాల, వెలుగు : జగిత్యాల మామిడికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తానని నిజామాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అర్వింద్ హామీ ఇచ్చారు. పసుపు మాదిరిగానే మామిడిపై అధ్యయనం చేసి మార్కెటింగ్‌ను స్ట్రీమ్‌లైన్ మీదికి తీసుకువస్తానని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల గడ్డ మీద జాతీయతాభావం ఎక్కువ ఉంటుందని, పీఎఫ్‌ఐ విముక్త్ జగిత్యాల కావాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ దెబ్బ తీసిందని ఆరోపించారు.
అభివృద్ధి విషయంలో మోదీతో ఎవరూ పోటీకి రాలేరన్నారు. ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జగిత్యాల మీదుగా బోధన్, నిజామాబాద్, అర్మూర్, మంచిర్యాల వరకు రూ. 4,100 కోట్లతో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్‌ను జగిత్యాల వరకు తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు.
అలాగే జగిత్యాల నుంచి మంచిర్యాల కనెక్టివిటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి, సీనియర్ నేతలు రాగిళ్ల సత్యనారాయణ, చిలుక మదన్‌మోహన్, పన్నాల తిరుపతిరెడ్డి, పడాల తిరుపతి, కొక్కు గంగాధర్ పాల్గొన్నారు.