కమ్యూనిస్టులు కేసీఆర్ కు ఎందుకు మద్దతిస్తున్నరో చెప్పాలి : ఎంపీ అర్వింద్

టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు మునుగోడు వాసులు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఖాసీం రజ్వీతో పోరాడిన కమ్యూనిస్టులు.. ఇప్పుడు ఖాసీం రజ్వీ తరహా పాలన చేస్తున్న కేసీఆర్ పంచన చేరి ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

డొల్ల మాటలు చెప్పి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన అబద్ధాల కోరు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరన్నారు. దేశంలో కుల, మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల 20 లక్షల ఇండ్లు నిర్మించి.. లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పారు. తొమ్మిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.