రాష్ట్రంలో 3 నెలల్లో ప్రభుత్వం మారబోతోంది : ఎంపీ అర్వింద్

తెలంగాణలో రానున్న మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతోందన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. వరి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతి చేస్తోందని ఆరోపించారు. కిలోకి 4 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వెనుకేస్తోందన్నారు. ప్రతి 25 లక్షల టన్నులకు రూ.1000 కోట్ల స్కామ్.. కోటి టన్నులు అమ్మితే రూ.4000 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని చెప్పారు. వీటన్నిటిని కేసీఆర్ కు క్యాష్ రూపంలో ఇస్తారని చెప్పారు. వీటిలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.40 కోట్లు ఇచ్చి రూ.100 సీట్లను రూ. 4000 కోట్లతో ఎలక్షన్ లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎంపీ అర్వింద్ ఈ కామెంట్స్ చేశారు. 

కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడుతోందని, అందులో ఎమ్మెల్యేకు కూడా ముడుపులు అందుతున్నాయని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఓడిస్తామని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని వార్తలు ప్రసారం చేస్తున్నాయని, అసలు కాంగ్రెస్ ఎక్కడ బలపడుతోందని ప్రశ్నించారు. ఎన్ని సీట్లు వచ్చినా రాష్ర్టంలో ప్రభుత్వం తమదే అని చెప్పారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. 2014, 2018లోనూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని.. రాబోయే ఎలక్షన్స్ లోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు మళ్లీ అమ్ముడుపోతారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. తమ లెక్కల ప్రకారం.. బీజేపీకి 70 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ 70 సీట్ల కంటే తక్కువే వచ్చినా.. ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ పాలన తీసుకొచ్చి.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.