ఆటో.. సెల్ ఫోన్ కోసమే ఫ్రెండ్ హత్య

ఆటో.. సెల్ ఫోన్ కోసమే ఫ్రెండ్ హత్య
  • నిందితుడిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ సిటీ పోలీసులు 

నిజామాబాద్, వెలుగు:  మర్డర్​ కేసులోని నిందితుడిని నిజామాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో, సెల్​ఫోన్ ​కోసమే ఫ్రెండ్ ను హత్య చేసినట్టు తేల్చారు. బుధవారం నిజామాబాద్ సిటీ ఏసీపీ రాజావెంకటరత్నం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. సిటీలోని నాగారం కాలనీకి చెందిన భైరగోని సతీశ్ గౌడ్​కు 2010లో పెండ్లి అయింది. మద్యానికి బానిసై పనిపాటలేకుండా తిరుగుతుండగా నాలుగేండ్ల కింద భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ ​వెళ్లి చోరీలు చేస్తుండడంతో పాటు ఒక హత్య కేసులో అతడు జైలుకు వెళ్లొచ్చాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తుండగా..  కాలనీకి చెందిన కండెల సందీప్​తో సతీష్​గౌడ్​కు పరిచయమైంది. సందీప్ ఆటో నడుపుతుంటాడు. 

దీంతో అతడిని చంపి ఆటో, సెల్​ఫోన్​ను చోరీ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈనెల15న సందీప్, సతీశ్ కలిసి నిజామాబాద్ సిటీలో ఆటో తోలగా.. వచ్చిన డబ్బులతో మద్యం తాగారు. కామారెడ్డికి కిరాయిలకు వెళ్దామని సతీశ్ నమ్మించాడు. ఇందల్వాయి టోల్​గేట్​ దాటాక ఫారెస్ట్​ ఏరియాలోకి తీసుకెళ్లి ఆటో ఆపాడు.  సందీప్ ​మూత్ర విసర్జనకు ఆటో దిగాడు. వెనుక నుంచి సతీశ్ కాలుతో తన్నడంతో కిందపడిపోగా బండరాయితో తీవ్రంగా కొట్టాడు. చనిపోయాడనుకుని ఫారెస్టులో కట్టెలు ఏరుకొచ్చి డెడ్​బాడీని కాల్చేసి ఆటోతో సతీశ్ హైదరాబాద్​ పారిపోయాడు. 

గత సోమవారం సగం కాలిన డెడ్​బాడీని హైవే పెట్రోలింగ్​ పోలీసులు గుర్తించారు. అప్పటికే మృతుడి భార్య లత ఫిర్యాదుతో  మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. మర్డర్​ కేసులో మృతుడి సెల్​ఫోన్ ​సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిగా సతీశ్ ను గుర్తించారు.   ఆటోలో  నాగారంలోని తల్లిదండ్రుల వద్ద వస్తుండగా మాధవ్​నగర్​ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేదించిన నార్త్​రూరల్​ సీఐ బి.శ్రీనివాస్, ఎస్​ఐ గంగాధర్​ను ఏసీపీ అభినందించారు.