ఫీల్డ్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 బాల్కొండ, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆహార భద్రత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిజామాబాద్​కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ముప్కాల్ మండలం నాగంపేట్, బాల్కొండ మండలం జలాల్ పూర్ లో చేపడుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వివిధ సంక్షేమ పథకాల అమలు, అర్హుల గుర్తింపు కోసం అవలంభిస్తున్న విధివిధానాలు, సర్వే బృందాలు సేకరిస్తున్న వివరాలను ఆయన పరిశీలించారు.  జలాల్ పూర్ శివారులోని రైతులకు సంబంధించిన పట్టా, అసైన్డ్ భూములను పరిశీలించి ఆఫీసర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.

ఎలాంటి తప్పిదాలు లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ గడువులోపు పూర్తి చేయాలన్నారు. నాలా పర్మిషన్ లేకుండా నిర్మించిన ఇంటి స్థలాలకు రైతుబంధు పొందుతున్నారని గుర్తించారు. వాటి వివరాలు నివేదించాలని ఆదేశించారు. రైతు భరోసా ద్వారా అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నంబర్ల వారీగా నిర్ధారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను అందించేందుకు ప్రత్యేక టీమ్​లు పరిశీలిస్తున్నాయన్నారు. ఈనెల 20 నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి 21 నుంచి 24 వరకు మండల స్థాయి ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించే గ్రామ సభలలో చదివి వినిపిస్తామన్నారు. గ్రామసభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్ లో నమోదు చేస్తామని చెప్పారు. కలెక్టర్​ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, ఆయా మండల స్పెషల్ ఆఫీసర్లు స్రవంతి, రసూల్ బి, తాహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులున్నారు.