
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో డ్రగ్స్ కంట్రోల్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఏపీ, ఒడిశా బార్డర్ నుంచి మహారాష్ట్రకు స్మగ్లింగ్ జరుగుతుందన్నారు. రోడ్, రైలు మార్గాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వినియోగించిన వారితో పాటు అమ్మినవారికి కఠిన శిక్షలు పడేలా కోర్టులకు ఆధారాలు అందించాలన్నారు.
కల్తీ కల్లు కోసం ప్రమాదకరమైన క్లోరోఫాం, అలఫ్రిజోలం ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వ్యసనాల బారీ నుంచి బయటపడేయడానికి డీ -అడిక్షన్ సెంటర్ ఓపెన్ చేయిస్తామన్నారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డీబీసీ నాయక్, మెడికల్, డ్రగ్ కంట్రోల్, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.