నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్ న్యూ మాస్టర్ ప్లాన్ వివాదాలు కొలిక్కి రావడం లేదు. ప్లాన్‌కు అభ్యంతరాలు వెల్లువెత్తినా ఏకపక్షంగా అమోదముద్రకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వర్గానికి అనుకూలంగా ప్లాన్‌కు సవరణలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ కిరికిరి..
2018 ఆగస్టు 20న మాస్టర్ ఫ్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మాస్టర్ ఫ్లాన్‌లో లోపాలపై 833 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించి జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు 2019 నవంబర్ 4న ప్రభుత్వానికి నివేదిక పంపారు. తర్వాత 73 గ్రామాల విలీనంతో ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 26 వరకు అభ్యంతరాల స్వీకరించారు. అప్పుడు కూడా 762 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో వినాయక్‌నగర్ నుంచి రేడియా స్టేషన్ ప్రాంతానికి చెందిన వారి అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేషన్ ఆఫీసర్లు వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి 146 అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా, విచారణ లేకుండానే న్యూ ప్లాన్‌పై నివేదిక సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆది నుంచి వివాదాలే...
1974 మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన దాఖాలాలు లేవు. 47 సంవత్సరాల్లో మున్సిపల్ బి గ్రేడ్ నుంచి కార్పొరేషన్ స్థాయికి మారింది. నగరం దాదాపు 12 కిలోమీటర్లు విస్తరించింది. మాధవనగర్ శివారు నుంచి బోధన్ వెళ్లేందుకు రింగ్ రోడ్ ఉంది. బీర్కూర్ న్యూ బ్రిడ్జి మీదుగా మహారాష్ట్రకు ఎక్స్ ప్రెస్ రోడ్ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సిటీ నడిబొడ్డు నుంచి వంద ఫీట్ల రోడ్డేమిటని ప్రశ్న తలెత్తుతుంది.
మాస్టర్ ప్లాన్‌పై ప్రచారం లేకపోవడంతో కేవలం వంద ఫీట్ల రోడ్ బాధితులు మాత్రమే హాజరై అభ్యంతరాలను తెలిపారు. గందరగోళంగా ఉన్న న్యూ మాస్టర్ ప్లాన్ సమూలంగా సవరించాలనే అభ్యంతరాలను పరిశీలించిన అనంతరమే ఆమోదముద్ర వేయాలని ప్రధాన రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
అభ్యంతరాలు పరిశీలించండి
కొత్త మాస్టర్ ప్లాన్‌లో కుట్ర కనిపిస్తోంది. ఓట్ల కోసం ఓ వర్గం నివాసిత ప్రాంతాలను మినహాయింపు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం. ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని మార్పులు చేయాలి.
- గడుగు రోహిత్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్
అలైన్‌మెంట్ మార్పుతో కొత్త ప్లాన్
కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ గజిబిజీగా ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్ మార్పుతో కొత్త ప్లాన్ రిలీజ్ చేయాలి.
- రామ్మోహన్‌రావు, బాధితుల కమిటీ కన్వీనర్