నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్స్ మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి. 549 ఎకరాల్లో ఉన్న భూములు రోజు రోజుకూ రియల్టర్ల, అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్నాయి. పబ్లిక్ అవసరాలకు ఈ భూమిని కేటాయించాలన్న ప్రపోజల్స్‌కు గవర్నమెంటు నుంచి ఆర్డర్స్ రాకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు భూముల్ని దర్జాగా దున్నేస్తున్నారు.
కోర్ కమిటీతో రక్షణ అయితలే..
ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తరువాత దాని ఆస్తులను కాపాడేందుకు 10 మంది ఉద్యోగులతో కోర్ కమిటీ ఏర్పాటైంది. రిటైర్ట్ తహసీల్దార్‌ను ఈ కమిటీకి ఇన్చార్జి ఆఫీసర్‌గా ఏడాదిన్నర కింద కాంట్రాక్టుపై అపాయింట్ చేశారు. అయినా.. ఈ కబ్జాలు ఆగడం లేదు. బెల్లాల్ ఫారంలో ఓ నలుగురు వ్యక్తులు సుమారు ఆరెకరాల ల్యాండ్ కబ్జా చేస్తున్నారనే సమాచారంతో వెళ్లగా తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారు. పట్టా ల్యాండ్ దున్నుతుంటే అడ్డుపడుతున్నావంటూ తిరగబడ్డారు. నర్సాపూర్‌లో ఎకరానికి రూ.2 కోట్ల విలువగల ల్యాండ్ నాలుగెకరాలను అర్ధరాత్రి దున్నేసి మరొకరు విత్తనాలు వేయగా ఆపడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. బోధన్-నిజామాబాద్ ప్రధాన రోడ్డు పక్కన ఓ రియల్ వ్యాపారి తన వెంచర్ ఆనుకొని ఉన్న ఫ్యాక్టరీ భూమి సుమారు రెండెకరాలు కలిపేసుకున్నారు. అక్కడ ఎకరం ల్యాండ్ మార్కెట్ రేటు రూ.4 కోట్లు ఉంది. పాండుఫారం, నర్సాపూర్, పెంటాకాలాన్, ఏఆర్పీ క్యాంపులో రూ.వంద కోట్లకు మించిన బ్యాలెన్స్ ల్యాండ్ కబ్జాకు గురైంది. పక్కపొలాలకు చెందిన వారే ఆక్రమణలకు పాల్పడ్డారు. కోర్ కమిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేసి పని ముగించుకుంటున్నారు.
పరిశ్రమ ఆస్తిగా ఉన్న 16,395 ఎకరాల్లో ఇప్పటిదాకా15,092 ఎకరాలు అమ్మేశారు. 11 (ఫారాలు)గ్రామాల ప్రజల కోసం ఉచితంగా వదిలేసిన భూమి, 99 ఎకరాల్లో ఫ్యాక్టరీ, ప్రార్థనా స్థలాలు, శ్మశాన వాటికలు , ఉద్యోగుల ఇండ్లకు కొంత భూమిని కేటాయించారు. వాటి మినహా మిగిలిన ల్యాండ్ పై ఏడాది కింద కస్టోడియన్ హోదాలో కలెక్టర్ సర్వే చేశారు. దీంతో 549 ఎకరాల మిగులు భూమి తేలింది. ఇందులో ఎక్కువ భాగం బోధన్ చుట్టే ఉంది. అప్పటికీ సుమారు 110 ఎకరాల భూమి వివరాలు లెక్క దొరకలేదు.
సర్కారుకు ప్రతిపాదనలు
మిగులు ల్యాండ్‌పై నిరంతర నిఘా సాధ్యంకాదని నిర్థారించుకున్న ఆఫీసర్లు పబ్లిక్ అవసరాలకు ఒకేసారి ఎలాట్ చేయడం మేలని నిర్ణయించారు. వ్యవసాయ రంగ పరిశ్రమలు, బోధన్‌లోని జిల్లా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు, హాస్టల్స్, గోదాముల నిర్మాణానికి కేటాయించాలని కలెక్టర్ ద్వారా సర్కారుకు వెళ్లిన ప్రతిపాదనలకు చలనంలేదు.