![టాక్స్ వసూళ్లపై ఫోకస్.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్ల టార్గెట్ రూ. 50 కోట్లు](https://static.v6velugu.com/uploads/2025/02/nizamabad-district-focuses-on-tax-collection-with-special-teams_yIPH3EzTsK.jpg)
- జిల్లావ్యాప్తంగా స్పెషల్ టీంల ఏర్పాటు
- ఇందూర్ కార్పొరేషన్లో 18.5 కోట్లు రికవరీ
- మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలపై ప్రత్యేక ఫోకస్
- అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్న ఆఫీసర్లు
నిజామాబాద్, వెలుగు : పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు స్పీడ్ పెంచారు. ఇందుకు గాను జిల్లా యంత్రాంగం స్పెషల్ టీంలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్ల టార్గెట్ రూ. 50 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.18.5 కోట్లను ఆఫీసర్లు వసూలు చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్వ్యవహరిస్తూ టాక్స్ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టాక్స్ బకాయి ఉన్న 20 వేల మందికి నోటీసులు జారీ చేశారు.
డిప్యూటీ కమిషనర్, ఈఈ, డిప్యూటీ మున్సిపల్ ఇంజినీర్, శానిటరీ సూపర్వైజర్ ను నోడల్ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు ప్రతి డివిజన్లో వార్డు ఆఫీసర్‌నూ నియమించారు. బకాయిదారుల వద్దకు వెళ్లి పన్ను వసూలు చేసి టార్గెట్‌ను రీచ్ అవుతున్నారు. టాక్స్ వసూళ్లపై నిత్యం సమీక్ష ఉంటుందని, అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. 50 శాతం కూడా టాక్స్ వసూలు కాని మున్సిపాలిటీలు, గ్రామాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కులగణన సర్వే, స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటరు లిస్టు తయారీలో అధికారులు నిమగ్నం కావడం వల్ల పన్నుల వసూళ్లలో కాస్త వెనుకబడినా, ప్రస్తుతం జోరు పెంచారు.
బల్దియాల్లోనూ అదే స్పీడ్..
పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీల్లోనూ అధికారులు స్పీడ్ పెంచారు. బోధన్ మున్సిపాలిటీలో రూ.6.39 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.2.84 కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.3.54 కోట్ల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ వెంకటనారాయణ ఏడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి పన్నులను వసూలు చేయిస్తున్నారు. భీంగల్ మున్సిపాలిటీలో కమిషనర్ గంగాధర్ ఐదు ప్రత్యేక టీంలతో రూ.2.25 కోట్ల బకాయిలకుగాను రూ.1.11 కోట్లు వసూలు చేయించారు. ఆర్మూర్ బల్దియాలో రూ.6.57 కోట్లకుగాను ఐదు టీంలు పర్యటిస్తూ 3.67 కోట్లను వసూలు చేశారు.
పంచాయతీల్లో టార్గెట్ రూ.16 కోట్లు..
జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.29.58 కోట్లు పన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల టార్గెట్ రూ.16 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.13 కోట్లు వసూలయ్యాయి. విలేజ్ సెక్రటరీలకు రోజు వారి టార్గెట్ పెట్టారు. అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామాల్లో టాక్స్వసూళ్లలో స్పీడ్ పెంచారు.