ఓనమాలు దిద్దుడెట్ల?..ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత

  • ఐదు క్లాసులకు ఒక్కరే టీచర్​
  • హైస్కూళ్లలోనూ సబ్జెక్ట్​ టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్​

గాంధారి మండలం నేరల్​ప్రైమరీ స్కూల్​లో 42 మంది స్టూడెంట్స్​ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ  ప్రతిభ రాణి అనే ఒక్క ఎస్జీటీ టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు. ఈమె కూడా బామన్​సింగ్​తండా స్కూల్ నుంచి డిప్యూటేషన్​పై  ఏడాది కింద ఇక్కడికి వచ్చారు. అన్నీ క్లాసులకు ఒకే టీచర్​ పాఠాలు చెప్పాల్సి వస్తోంది. పిసికిల్​గుట్ట తండా ప్రైమరీ స్కూల్​లో 1 నుంచి 5 వ క్లాస్​వరకు ఉండగా, 23 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. ఒకరే టీచర్​ ఉండడంతో అన్నీ క్లాసులకు మొత్తం సబ్జెక్ట్స్​ చెప్పడం ప్రాబ్లమవుతోంది. 1, 2  క్లాసులను ఒక దగ్గర, 3,4,5 క్లాసులను మరో దగ్గర కూర్చొబెట్టి బోధిస్తున్నారు.

కామారెడ్డి వెలుగు:కొత్తగా స్కూల్లో చేరుతున్న చిన్నారులకు సరైన చదువు అందడం లేదు. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత 1, 2 తరగతుల పిల్లలకు శాపంగా మారుతోంది. సింగిల్​ టీచర్​ ఉన్న స్కూళ్లలో పై క్లాస్​పిల్లలే ఫస్ట్​, సెకండ్​ క్లాసుల పిల్లలతో ఓనమాలు దిద్దిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో​ 696  ప్రైమరీ స్కూల్స్, ​126 యూపీఎస్, 183 హైస్కూల్స్​ ఉన్నాయి. మొత్తం 4,938 టీచర్​ పోస్టులకు శాంక్షన్ ఉండగా, ప్రస్తుతం 4,081 మంది పనిచేస్తున్నారు. 857 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రైమరీ స్కూళ్లల్లో పనిచేసే  ఎస్జీటీ పోస్టులే 253 ఖాళీగా ఉన్నాయి. హైస్కూళ్లలోనూ సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్​30, ఫిజికల్ సైన్స్​14,  బయాలజీ 44, సోషల్ 106, తెలుగు 25, హిందీ 20, ఇంగ్లీష్​ 28, లాంగ్వేజ్​ పండిత్​ తెలుగు 5,  హిందీ పండిత్​4, హెడ్​మాస్టర్లు 112 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర విభాగాల్లో 216 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా టీచర్ల భర్తీ చేపట్టకపొవడం, బదిలీలు లేకపోవడంతో ఎక్కువగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అకడమిక్ ​ఇయర్ ​స్టార్టయ్యి 
3 వారాలు దాటినా, ఇంకా అవసరమున్న చోట టీచర్ల సర్దుబాటు చేయలేదు. దీంతో ప్రైమరీ స్కూల్​లో ఒకరే టీచర్ ​ఉన్న తండాలు, గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్​కు పంపుతున్నారు.

 సింగిల్ ​టీచర్​తో అవస్థలు..      

జిల్లాలో 696 ప్రైమరీ స్కూల్స్​ ఉంటే, ఇందులో  130 సింగిల్​ టీచర్ తో కొనసాగుతున్నాయి. జిల్లాలో వెనకబడిన ప్రాంతమైన జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్​గల్ మండలాల్లో​, గాంధారి, సదాశివ్​నగర్, రాజంపేట, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో సింగిల్​ టీచర్​ స్కూళ్లు  ఎక్కువగా ఉన్నాయి.దీంతో 1 నుంచి 5 క్లాస్​వరకు అందరు విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి టీచర్లు ​పాఠాలు చెప్పాల్సి వస్తోంది. మరికొన్ని ప్రైమరీ స్కూళ్లలో 1,2 క్లాసులను ఒక దగ్గర, 3,4,5 క్లాసులను ఒక దగ్గర కూర్చోబెట్టి క్లాసులు చెబుతున్నారు. 30 మంది స్టూడెంట్స్​ కంటే తక్కువగా ఉండి సింగిల్​టీచర్ తో ఉన్నవి 62 స్కూళ్లు ఉన్నాయి. 

నేర్చుకొలేక పోతున్రు..

ప్రైమరీ స్కూళ్లలో ఒకే టీచర్ ​ఉండడంతో బేసిక్​నేర్పడం ప్రాబ్లమ్​గా మారుతోంది. ఒక క్లాసుకు పాఠాలు చెబుతుంటే మరో క్లాసు స్టూడెంట్స్​ఖాళీగా ఉంటున్నారు. ఒకే దగ్గర అందరినీ కూర్చొబెట్టి చెప్పడంతో పాఠాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకటో తరగతి వారికి ఓనమాలు పెట్టించడం కూడా ఇబ్బందవుతోందని పలువురు టీచర్లు అంటున్నారు. ఏ క్లాసు స్టూడెంట్స్​పై తాము శ్రద్ధ 
పెట్టలేకపోతున్నామంటున్నారు.

సర్దుబాటు చేయాలని ఎంఈవోలకు చెప్పాం

స్టూడెంట్స్​ ఎక్కువగా ఉండి ఒకరే టీచర్​ఉన్న దగ్గర, సమీపంలో ఏదైనా స్కూల్​లో  టీచర్లు ఎక్కువగా ఉంటే సర్దుబాటు చేయాలని ఎంఈవోలకు సూచించాం. స్టూడెంట్స్​కు ప్రాబ్లమ్స్​ రాకుండా, స్కూళ్లు ​కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. టీచర్ల భర్తీ ప్రభుత్వ నిర్ణయం.
- రాజు, డీఈవో, కామారెడ్డి