నిజామాబాద్ జిల్లాలో వరుసగా విషాద సంఘటనలు జనాన్ని ఆందోళన గురిచేస్తున్నాయి. కరోనా టెస్టు కోసం వచ్చి ఒకరు చనిపోయారు. కరోనా వస్తుందేమోనన్న భయంతో ఆసుపత్రి భవనంపై నుంచి దూకి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన భార్యను మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడు ఇంకో వ్యక్తి.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బొర్గం గ్రామంలో విషాదం ఏర్పడింది. కన్నతల్లి ఒడిలో కన్నుమూశాడు ఓ కొడుకు. బోర్గం గ్రామానికి చెందిన అశోక్.. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కరోనా టెస్టు చేయించుకుంటానంటే తల్లి కూడా వెంట వెళ్లింది. టెస్ట్ చేశాక నెగిటివ్ అని తెలియగానే ఇద్దరు సంతోషించారు. కాసేపు చెట్టు కింద కూర్చొని ఇంటికి వెళ్దామనుకొని అక్కడే కూర్చున్నారు. అంతలోనే అశోక్..ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించిన తల్లి..ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురైంది. ఏమవుతుందో అర్థమయ్యే లోపే కొడుకు తల్లి ఒడిలోనే కన్నుమూశాడు. కళ్ల ముందే కన్న కొడుకు ఊపిరి ఆగిపోవడం చూసి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ దారుణం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసే నాగలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. కరోనాతో చనిపోయి ఉండొచ్చని డెడ్ బాడీ దగ్గరకు ఎవరూ రాలేదు. కనీసం ఆటో డ్రైవర్లు కూడా డెడ్ బాడీని స్మశాన వాటికకు తరలించేందుకు ముందుకు రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య డెడ్ బాడీని భుజాలపై వేసుకొని మోసుకెళ్లాడు మృతురాలి భర్త. మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న స్మశాన వాటిక వరకు శవాన్ని భుజాలపై మోసుకెళ్లాడు. దహన సంస్కారాల కోసం మధ్యమధ్యలో మృతదేహంతో బిక్షాటన చేశాడు.రైల్వే పోలీసులు, స్థానికులు 25 వందల విరాళాలు సేకరించి మృతురాలి భర్తకు అందించారు.
ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోణా పరీక్షల కోసం వచ్చిన వ్యక్తి తనకు కరోనా పాజిటివ్ వస్తుందేమోనని భయపడి ఆసుపత్రిలోని 5వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. కరోనాతో చనిపోతున్నవారిని చూసి ఈ వ్యక్తి ఆందోళన చెంది ఉండాడని డాక్టర్లు చెబుతున్నారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.