బిల్లులు రాక అప్పులు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

బిల్లులు రాక అప్పులు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
  •  నిద్రమాత్రలు మింగినలావణ్య గౌడ్​
  • అపస్మారక స్థితిలో చికిత్స
  • గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అప్పులు  
  • వడ్డీలు కట్టలేక ఆర్థిక భారం  పదవి నుంచి సస్పెన్షన్, 
  • భర్త  జైలుకెళ్లడంతో కలత  
  •  ఎమ్మెల్యే జీవన్​రెడ్డే కారణమన్న బీజేపీ లీడర్లు


నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్​జిల్లా ఆలూరు మండలం కల్లెడ తాజా, మాజీ సర్పంచ్ ​లావణ్యగౌడ్​మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనుల బిల్లులు రాకపోవడం, వాటి కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేకపోవడం, డబ్బులిచ్చిన వారి నుంచి ఒత్తిడి, సర్పంచ్​పదవి నుంచి సస్పెండ్​చేయడం,  ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై హత్యాయత్నం కేసులో తన భర్త ప్రసాద్​గౌడ్​ జైలుకు వెళ్లడం వంటి కారణాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్​ అటెంప్ట్​ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నిజామాబాద్​గవర్నమెంటు హాస్పిటల్​లో చేర్పించారు. లావణ్య 2019లో బీసీ మహిళ రిజర్వు పంచాయతీకి సర్పంచ్​గా గెలిచారు. ఆమె భర్త ప్రసాద్​గౌడ్​ మొదటి నుంచి బీజేపీ సానుభూతిపరుడు.  బీఆర్ఎస్​లో చేరితేనే డెవలెప్​మెంట్​పనులకు ఫండ్స్​ఇస్తామని రూలింగ్​పార్టీ పెద్దలు స్పష్టం చేయగా అంగీకరించారు. తర్వాత గ్రామంలో రూ.30 లక్షల అప్పు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ కెనాల్స్​నిర్మించారు. గవర్నమెంటు నుంచి బిల్లులు  రాకపోవడంతో వడ్డీల  భారం ఎక్కువైంది. 2022 ఫిబ్రవరిలో ఆఫీసర్లు నిధుల విషయంలో అవకతవకలు జరిగాయంటూ సర్పంచ్​పదవి నుంచి లావణ్యను సస్పెండ్​చేశారు.  

భర్త జైలుకు వెళ్లాక మరింత డీలా

బీఆర్ఎస్​లోకి తాను రమ్మన్నప్పుడు రాకుండా ఆలస్యం చేశాడని గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే జీవన్​రెడ్డితో ప్రసాద్​కు దూరం పెరిగింది. విభేదాలు అంతకంతకూ పెరుగగా హైదరాబాద్​లోని తన ఇంట్లో హత్యాయత్నం చేశాడని ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ప్రసాద్​పై ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై హైదరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసి ఫిబ్రవరిలో జైలుకు పంపారు.  జైలు నుంచి జులైలో బయటకు వచ్చాక గ్రామం నుంచి భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని నిజామాబాద్​కు షిఫ్ట్​అయ్యాడు. అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో లావణ్య గ్రామానికి వెళ్లడమే మానేశారు.  

అప్పులోళ్లు ఇంటికి వచ్చి తిట్టడంతో..

పిల్లల స్కూల్స్​కు గత శని,ఆదివారం సెలవులు రావడంతో కుటుంబంతో కలిసి లావణ్య కల్లెడ గ్రామానికి వెళ్లింది.  విషయం తెలిసి రూ.3 లక్షలు అప్పిచ్చిన ఓ వ్యక్తి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. భార్యాపిల్లలను వెంటేసుకొని ఇంటికి వచ్చి కూర్చున్నాడు. లావణ్యను నానా మాటలన్నాడు.అయితే, ఈ అప్పిచ్చిన వ్యక్తిని జీవన్​రెడ్డే పంపాడన్న ఆరోపణలున్నాయి. దీంతో కలత చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. 

ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి రోజులు దగ్గర పడ్డయ్​

ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కిరాతక రాజకీయాలు, దౌర్జన్యానికి అంతులేకుండా పోయిందని బీజేపీ లీడర్​ పైడి రాకేష్​రెడ్డి అన్నారు. హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్న లావణ్యను పరామర్శించి మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా ఉన్నాడని అప్పట్లో దళితుడిని హత్య చేయించాడని, జర్నలిస్టుపై దాడి చేయించాడని, తన ఆధిపత్యానికి సలామ్ ​కొట్టని మహిళా సర్పంచ్​కు బిల్లులు రాకుండా చేసి చివరకు ఆమె కుటుంబాన్ని యాతన పెడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి కల్పించారన్నారు. రాక్షసానందం పొందుతున్న ఎమ్మెల్యేకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. లావణ్యకు తాము అండగా ఉంటామన్నారు.