నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్​లో అలకలు

  • బోధన్​లో తిరుగుబాటు స్వరం 
  • కొత్తవాళ్లకు టికెట్లివ్వడంపై  నారాజ్
  • ఇంకా పెండింగ్​లో రెండు స్థానాలు

నిజామాబాద్​, వెలుగు:  జిల్లాలో  కాంగ్రెస్​పార్టీ క్యాండిడేట్లను  ప్రకటించిన మూడు సెగ్మెంట్లలో ఛాన్స్​ దక్కని లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. వీరు  అలక వహించడంలో టెన్షన్​ మొదలైంది. నారాజ్​గా ఉన్న లీడర్లు   క్యాండిడేట్లకు, ప్రచారానికి  దూరంగా ఉండడంతో   మున్ముందు వారి తీరు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ తొలి జాబితాలో బోధన్​, బాల్కొండ, ఆర్మూర్​ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ప్రకటించింది.  బోధన్​ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత  ఇక్కడ నుంచి టికెట్​ ఆశించిన  కెప్టెన్​ కరుణాకర్​రెడ్డి  తీవ్ర నిరాశకు గురయ్యారు.  

బోధన్​ నుంచి పోటీ చేయాలన్న ఆశతో ఆయన చాలాకాలంగా  సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. యువజన కాంగ్రెస్​ద్వారా పాలిటిక్స్​లోకి వచ్చిన ఆయన 20 ఏండ్ల నుంచి నియోజకవర్గంలో యాక్టివ్​గా ఉంటున్నారు.  2004 ఎన్నికల్లో  జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 19 వేల ఓట్లు పొందారు.  

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా   పోటీ చేసి 34 వేల పైచిలుకు ఓట్లు పొందారు.  2018 ఎన్నికల టైంలో సుదర్శన్​రెడ్డితో రాజీ కుదరగా  మళ్లీ కాంగ్రెస్​లోకి వచ్చారు. ఈసారి కూడా  సుదర్శన్​రెడ్డికే టికెట్​  ఇవ్వడంతో కెప్టెన్​ కినుక వహించారు. సొంతంగా క్యాడర్​ ఉన్న ఆయన ఈసారి తాను బరిలో ఉంటానని   ప్రకటించారు.  కేప్టెన్​ తిరుగుబాటు ప్రకటించడం చర్చనీయాంశమైంది.  ఆయన స్వతంత్రంగా బరిలో ఉంటారా.. ఏ పార్టీలోనైనా చేరతారాఅన్నది అంతుబట్టటంలేదు.  

కొత్తవాళ్లకు అసమ్మతిసెగ

ఆర్మూర్ నుంచి  దాదాపు పది మంది టికెట్​ ఆశించారు. వారిలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీశ్రీనివాస్​ అలియాస్​ చిన్న  తనకే ఛాన్స్​వస్తుందని  ధీమాతో ఉన్నారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్​ మార చంద్రమోహన్​అయితే  ఓ అడుగు ముందుకేసి  ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. గోర్త రాజేందర్ కూడా బీసీ కోటా కింద ​తనకే టికెట్​ వస్తుందని ఆశతో ఉండగా..  కొత్తగా పార్టీలోకి వచ్చిన పొద్దుటూరి వినయ్​రెడ్డికి ఫస్ట్​లిస్ట్​లోనే చాన్స్​ దక్కింది.  అప్పటి నుంచి ఆశావహులంతా సహాయ నిరాకరణ చేస్తున్నారు.  

బాల్కొండలోనూ ఈ మధ్యే  కాంగ్రెస్​లో చేరిన ఆరేంజ్​ ట్రావెల్స్​ అధినేత ముత్యాల సునీల్​రెడ్డి పేరును ప్రకటించారు.  ఇక్కడ నుంచి  పోటీ చేయాలని భావించిన డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి యాడాది నుంచి సెగ్మెంట్​లో పని చేస్తున్నారు.  మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రాతినిధ్యం  వహిస్తున్న బాల్కొండలో  అధికార  పార్టీ అవినీతిపై గట్టిగా పోరాడారు.  ఏడాది నుంచి తాను గ్రౌండ్​వర్క్​ చేసుకుంటే చివరి నిమిషంలో పార్టీలో చేరి టికెట్​ ఎగరేసుకుపోయారని మానాల తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇక్కడ టికెట్​ ఆశించిన కాంగ్రెస్​ కిసాన్​స్టేట్​ ప్రెసిడెంట్​ అన్వేష్​రెడ్డి  కూడా అలక వీడడంలేదు.  

దీంతో సునీల్​రెడ్డికి అసమ్మతి సెగ తాకుతోంది. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు పార్టీ ద్వారా ఎలాంటి  ప్రయత్నాలు జరగడంలేదు. జిల్లాకు చెందిన సీనియర్​లీడర్లు తమ టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. రెండో లిస్ట్​వచ్చిన తర్వాతే అసమ్మతి మీద సీనియర్​ లీడర్లు ఫోకస్​ పెట్టే అవకాశం ఉంది. అంతలోపు డ్యామేజీ జరుగుతుందేమోనని క్యాండిడెట్లు భయపడుతున్నారు. 

 ఎవరికి చాన్స్​ ఇచ్చినా .. 

నిజామాబాద్​ అర్బన్​, రూరల్​సెగ్మెంట్లకు ఇంకా క్యాండిడెట్లను ప్రకటించలేదు.  ఇక్కడ రోజుకో   పేరు  ప్రచారంలోకి వస్తోంది.  అర్బన్​ నుంచి 12 మంది నువ్వా నేనా అన్నట్లు పోటీ  పడుతున్నారు.  కొత్తగా  ప్రముఖ మైనారిటీ లీడర్​ పేరును అర్బన్​ కోసం  హైకమాండ్​పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యాపారవేత్తను పార్టీలోకి తీసుకుని  టికెట్​ఇవ్వాలన్న ఆలోచనకూడా ఉన్నట్టు  తెలుస్తోంది.రూరల్​లో ఇప్పటికే ఇద్దరు లీడర్ల మధ్య టికెట్​కోసం తీవ్ర  పోటీ నెలకొంది. కొత్తగా  మరో సీనియర్​ నేత  పార్టీలో చేరతారన్న  ప్రచారం జరుగుతోంది.   రెండు సెగ్మెంట్లలో  ఎవరికి టికెట్​ ఇచ్చినా మిగతా నేతల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు. జిల్లాలో పార్టీకి సానుకూలత పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో అసమ్మతి వల్ల నష్టం కలుగకుండా సీనియర్​లీడర్లు వెంటనే అలకలు తీర్చాలని క్యాడర్​ భావిస్తోంది