- గత నెలలో 267 మందికి జైలు శిక్ష, 649 కేసులు ఫైల్
- ఈ నెలలో ఇప్పటివరకు 336 కేసులు, 63 మంది జైలుకు
- తాగి బండ్లు నడిపేవారిపై సీపీ కల్మేశ్వర్ సీరియస్
నిజామాబాద్, వెలుగు: మద్యం తాగి వాహనాలు నడిపే మందుబాబులపై నిజామాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. తాగి వెహికల్స్ నడిపిస్తే జైలుకే అనే విధంగా నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ మందుబాబులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజూ ఐదు వేల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని సీపీ ఆదేశించారు. దీంతో ఏ మాత్రం అనుమానం వచ్చిన బండ్లను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండడంతో తాగి వాహనం నడపాలంటే జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా బ్రీత్ అనలైజర్లతో మందుబాబుల భరతం పడుతున్నారు. దీంతో గత నెల కంటే ఈ నెలలో చాలా వరకు కేసులు తగ్గాయి.
గత నెలకంటే తగ్గిన కేసులు
మార్చి నెలలో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 649 రిజిస్ర్టర్ కాగా అందులో 267 మందికి గరిష్టంగా రెండు వారాల జైలు శిక్ష పడింది. ఈ నెలలో ఇప్పటిదాకా ఐదు వేల బ్రీత్అనలైజింగ్ టెస్ట్‌లు నిర్వహించి 336 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 63 మందికి జైలు శిక్ష పడగా అందులో ఒకరికి నెల రోజుల శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు పెంచడంతోనే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పోలీసులు భావిస్తున్నారు.
ఆర్మూర్‌లో 256 మందిపై కేసులు.. 19 మంది జైలుకు
ఈనెల 12న ఆర్మూర్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో బ్రీత్అనలైజింగ్పరీక్షలు నిర్వహించి ఒకే రోజు 256 మందిపై కేసులు పెట్టారు. ఇందులో ఒకే రోజు 19 మందిని జైలుకు పంపారు. ప్రతి రోజూ డిచ్పల్లి, ఇందల్వాయి నుంచి ఎస్ఎస్నగర్ దాకా హైవే పెట్రోలింగ్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గతేడాది 767 యాక్సిడెంట్లు 337 మరణాలు
గతేడాది జిల్లాలో 767 రోడ్ యాక్సిడెంట్లు కాగా 337 మంది మృతి చెందారు. మిగితా వారు చాలా వరకు వికలాంగులుగా మారిపోయారు. తీవ్ర గాయాలైన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ చేసిన ఘటనలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాలను తగ్గించే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. చాలా వరకు ప్రమాదాలు కంట్రోల్ లోకి వచ్చాయి. మహిళల పట్ల ఆకతాయిల న్యూసెన్స్ తగ్గింది.