
- నిత్యం యాప్‌లో పంటల వివరాలు నమోదు
- టెక్నికల్ సమస్యలు అధిగమిస్తూ ముందుకు..
- స్టేట్‌లో ఏడో స్థానంలో నిజామాబాద్ జిల్లా
- ఇక ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం చెల్లింపులకు ఈజీ
నిజామాబాద్, వెలుగు : డిజిటల్ క్రాప్ సర్వే జిల్లాలో వేగంగా సాగుతుంది. పల్లె, రైతు పేర్లు, సర్వే నంబర్, సాగైన పంట, ఎన్ని ఎకరాలు అన్న వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. నిత్యం 106 మంది ఏఈవో విధులు నిర్వహిస్తున్నారు. నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ బిజీ సమస్యలను అధిగమిస్తూ స్టేట్‌లో ఇందూర్ జిల్లాను ఏడో స్థానంలో నిలబెట్టారు. పంట కోతలు ముగిసే నాటికి టార్గెట్ పూర్తి చేసి టాప్ త్రీలో ఉండేలా ముందుకెళ్తున్నారు. మొత్తం 3,03,176 సర్వే నంబర్లలో 2,79,500 నంబర్ల భూమిలో సాగవుతున్న పంటల వివరాలను డిజిటల్ యాప్‌లో నమోదు చేశారు.ఉపయోగం ఏమిటంటే..
జిల్లాలో 5.40 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రతి 5 వేల ఎకరాలను క్లస్టర్‌గా విభజించి ఒక ఏఈవోకు పంటల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సీజన్ ముగిసే దాకా చీడపీడలు, తెగుళ్లు యూరియా, క్రిమిసంహారక మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కోతలు ముగిసి పంట దిగుబడులు మార్కెట్ చేరేదాకా ఏఈవోలు గమనిస్తారు. సీజన్ వారీగా గవర్నమెంట్ కు ఇచ్చే రిపోర్టును బట్టి యూరియా డిమాండ్, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుంది? దిగుబడి అంచనాలు, పంట కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై సర్కారు అంచనాకు వస్తుంది. గతేడాది వరకు ఈ వివరాలను వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ సర్వేతో నమోదు చేసేవారు.
అంటే రైతులు అందించే వివరాలనే అఫీషియల్‌గా ఎంటర్ చేసి గవర్నమెంట్‌కు పంపేవారు. రైతులు అందుబాటులోకి రాకుంటే వారు సాగు చేసిన పంటలను సొంత అంచనాతో నమోదు చేసేవారు. ఒక పంటకు బదులు మరో పంట వివరాలు నమోదు కావడంతో అంచనాలు తప్పేవి. ఆ లోపాన్ని సెట్ చేసేందుకు గవర్నమెంట్ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది.
ఏఈవోలు విధిగా ఫీల్డ్ విజిట్ చేసి పంట, రైతు వివరాలు ఫొటోతో సహా ఆన్లైన్ చేస్తున్నారు. సీజన్ వారీగా రైతు భరోసా అర్హుల సమాచారాన్ని గవర్నమెంట్ కు చేరవేస్తుంది. ఏదేని కారణాలతో పంటలకు నష్టం కలిగితే రైతు పేరు, పంట, విస్తీర్ణం ఇతర వివరాలు గవర్నమెంట్ వద్ద అప్పటికే ఉంటాయి కాబట్టి పరిహారం విషయంలో ఈజీగా నిర్ణయం తీసుకోవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది.
ప్రతి రోజు 2,637 ఫొటోలు..
డిజిటల్ క్రాప్ సర్వేకు నో చెప్పిన ఏఈవోలు గవర్నమెంట్ సీరియస్ వార్నింగ్‌తో పని షురూ చేశారు. జిల్లాలో 106 మంది ఏఈవోలుండగా వారిలో మహిళలకు 1,800 ఎకరాలు, పురుషులకు 2 వేల ఎకరాల డిజిటల్ క్రాప్ సర్వే బాధ్యతలు అప్పగించారు. ఏఈవోలు ఏ సర్వే నంబర్ ల్యాండ్‌లో నిలబడి ఉన్నారో క్లియర్‌గా చెప్పేలా సాఫ్ట్వేర్ రూపొందించి ఫోన్లో డౌన్లోడ్ చేశారు.
ఒక సర్వే నంబర్లో మరో పంట ఎంటర్ చేస్తే సాఫ్ట్వేర్ స్వీకరించదు. ఇలా నిత్యం జిల్లాలో ఏవరేజ్‌గా 2,637 మంది రైతులు, పంటల వివరాలు ఫొటోలతో సహా ఆన్లైన్ చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికి 2,79,500 సర్వే నంబర్ల క్రాప్ సమాచారాన్ని సర్కారుకు పంపించారు. మిగిలిన 23,676 సర్వే నంబర్ల డాటా కూడా సీజన్‌లోపే పూర్తి చేయడానికి వేగం పెంచారు.
మేలు చేసే సర్వే
డిజిటల్ క్రాప్ సర్వేతో సర్కార్‌కు పక్కా లెక్కలు అందుతాయి. చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం సులభతరమవుతుంది. ఇన్సూరెన్స్, పంటలకు పరిహారం అందజేత ఈజీ అవుతుంది. సిగ్నల్స్, సర్వర్ సమస్యలు ఎదుర్కొంటూ సర్వే కొనసాగిస్తున్నాం. - వాజీద్‌హుస్సేన్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్