భారీ వర్షం.. నాట్లు షురూ

భారీ వర్షం.. నాట్లు షురూ
  • నిజామాబాద్  జిల్లాలో ఒక్కరోజే 431 మిల్లీ మీటర్ల వర్షపాతం
  • దుక్కులు రెడీగా ఉన్న భూముల్లో వరినాట్లు షురూ
  • ఈ సీజన్ లో తొలిసారి కురిసిన భారీ వర్షం 
  • సోయా, పత్తి విత్తనాల అలుకుడు స్టార్ట్

నిజామాబాద్​, వెలుగు: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత నిజామాబాద్  జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున  భారీ వర్షం కురిసింది. మృగశిరకార్తె తర్వాత జిల్లాలోని ఎక్కువ మండలాల్లో వర్షం జాడే లేదు.  దీంతో వ్యవసాయ పనులు లేట్ అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతుండగా..  ఆదివారం భారీ వర్షం కురవడంతో ఆనందంలో మునిగిపోయారు.  ఇప్పటికే దుక్కులు రెడీ చేసి చినుకుల కోసం ఎదురు చూస్తున్న రైతులు వరినాట్లు షురూ చేశారు.  జిల్లా వ్యాప్తంగా  ఒక్క రోజే 431 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

దీంతో సోయాబిన్, పత్తి రైతులు అలుకుడు మొదలెట్టారు.  ఈ ఏడాది జిల్లాలో 4.80 లక్షల ఎకరాల్లో  వరి పంటలు వేయనున్నట్లు అంచనా ఉండగా..  20 వేల ఎకరాల్లో  సోయాబిన్​, వెయ్యి ఎకరాల్లో  పత్తి, 400 ఎకరాల్లో  మినుము, పెసర  పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.  బోధన్​ డివిజన్‌లోని  మండలాల్లో  ఇతర ప్రాంతాల కంటే ముందే వరి నాట్లు ముందు ప్రారంభిస్తారు.  ఏటా జూన్​ మొదటి వారంలోనే నాట్ల కోసం నారు రెడీ చేసుకుంటారు.  కానీ ఈ సారి వర్షాలు లేట్ గా కురవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు ప్రతి గ్రామంలో 50 మందికి పైగా నాట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. 

నవీపేటలో భారీ వర్షం 

వర్షాకాలం మొదలైన తర్వాత ఇప్పటిదాకా జిల్లాలో 3,525 ఎం.ఎం (మిల్లీ మీటర్ల)  వర్షం పడగా ఆదివారం ఒక్కరోజే 431 ఎం.ఎం వర్షం నమోదైంది.  నవీపేట మండలంలో 83.7  మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రెంజల్​లో 48 ఎం.ఎం, ఎడపల్లి 33.3 ఎం.ఎం, బోధన్​ 32.5 ఎం.ఎం, నిజామాబాద్​ నార్త్​ 29.3, సౌత్​ 16.3, నిజామాబాద్​ రూరల్​ 26.1, మోస్రా 20.4, వర్ని 16.6,  సాలూరా 17.5, మాక్లూర్​ 14.4, నందిపేట 13.2, మెండోరా 7.1, ఆర్మూర్​ 7.4, మోర్తాడ్​ 6.8, జక్రాన్​పల్లి 6.6, ఆలూరు 6.6, ముప్కాల్​ 6.4, బాల్కొండ 6.4,  భీంగల్​ 4.9, వేల్పూర్​ 3.9, కమ్మర్​పల్లి 3.1, మోపాల్​ 2.5, డిచ్​పల్లి 2.1, చందూర్​, కోటగిరి, రూద్రూర్​, పోతంగల్, సిరికొండ, డిచ్​పల్లి, ఇందల్వాయిలో ఓ మోస్తారు వర్షం పడింది.