
- సహకరించిన అదనపు కలెక్టర్, డీఎస్వో, డీటీపై కేసులు
- కోటగిరి మార్కెట్ గోదాంలో సీజ్ చేసిన 9 వేల బస్తాలు ఎవరివి..?
నిజామాబాద్, వెలుగు : గవర్నమెంట్ కస్టమ్ మిల్లింగ్ వడ్లు గయాబ్ అయిన ఉదంతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పని చేసిన బడుగు చంద్రశేఖర్, డీఎస్వో చంద్రప్రకాశ్, డీటీ నిఖిల్రాజ్పై పోలీస్ కేసు నమోదు కావడం జిల్లాలో కలకలం రేపింది. పవర్‌కు తలొగ్గి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ రైస్‌మిల్స్ రూల్స్‌కు భిన్నంగా సహకరించిన పాపానికి ఇప్పుడు బలయ్యారు. సుమారు రూ.80 కోట్ల విలువ సీఎంఆర్ వడ్లను హాంఫట్ చేసిన షకీల్ ఎంచక్కా దుబాయికి జారుకోగా, అతడికి మేలు చేసినందుకు ఆఫీసర్లు కేసుల్లో ఇరుక్కున్నారు. కింది స్థాయి అధికారులకు భరోసా కల్పిస్తూ రోల్ మాడల్‌గా ఉండాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌పై కేసు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సర్కారు తమదేనన్న ధీమా..
జిల్లాలోని బోధన్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా షకీల్ ఆమెర్ 2014-–2023 వరకు రెండు సార్లు గెలిచారు. సెకెండ్ టైం గెలిచాక రైస్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. ఇతర దేశాలకు బియ్యం ఎక్స్‌పోర్టు చేశారు. బోధన్ మండలంలో మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న విలేజ్‌లో సొంతగా రైస్ మిల్లు నిర్మించడమే కాకుండా మరికొన్ని లీజ్‌కు తీసుకున్నారు. అమీర్ ఆగ్రో ఫోర్స్, రాహిల్ ఫుడ్స్, రాస్ ఫుడ్స్, ధన్విక్ ఆగ్రో మిల్స్, సైరన్ ఆగ్రో ఇండస్ట్రిస్ పేరుతో రైస్ మిల్స్‌కు 2021-–22 వానకాలం, యాసంగి, 2022-–23 వానకాలం సీజన్లో 37,019 మెట్రిక్ టన్నుల వడ్లను కస్టమ్ మిల్లింగ్ కోసమంటూ తోలుకున్నారు. వడ్ల కొనుగోలు సెంటర్లకు డైరెక్ట్ ఫోన్లు చేసి మరీ వడ్ల లారీలు మళ్లించుకున్నారు. దీనికి రెవెన్యూ, సివిల్ సప్లయ్ ఆఫీసర్లు పూర్తి సహకారం అందించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను మిల్లుల మిల్లింగ్ కెపాసిటీ, స్టాక్ చేసేందుకు వీలుగా గోదాం కెపాసిటీ ఆధారంగా సివిల్ సప్లయ్ ఆఫీసర్లు అలాట్మెంట్ ఇస్తారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో పరిమితికి మించి వడ్లు తరలించుకెళ్తున్నా అప్పటి ఆఫీసర్లు సైలెంట్‌గా ఉన్నారు. సరే తోలుకున్న వడ్లను మిల్లింగ్ చేసి పూర్తిస్థాయిలో సీఎంఆర్‌కు అప్పగించలేదు. సుమారు 5 వేల టన్నుల వడ్లకు సమానమైన రైస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ద్వారా ఎఫ్‌సీఐకి చేరగా, మిగతా బియ్యానికి సంబంధించి కథలల్లారు. మెషినరీ సమస్య వల్ల మిల్లింగ్ చేయలేకపోతున్నానని తన ఆధ్వర్యంలోని రైస్ మిల్లుల్లో ఉన్న సీఎంఆర్ వడ్లను బోధన్‌లోని ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్, వర్నిలోని ఆర్‌కాం ఇండస్ట్రిస్, ఎడపల్లి మండలంలోని ఏఆర్ ఇండస్ట్రిస్, అదే మండలంలోని అబ్దుల్ హై ఇండస్ట్రిస్కు షిష్ట్ చేశానని తెలిపారు. ఆ రైస్ మిల్లు ఓనర్లను ఆఫీసర్లతో బెదిరించి వడ్లు ముట్టినట్లు వారితో లెటర్లు ఇప్పించారు. ఎంతకూ తమ మిల్లులకు వడ్లు చేరకపోవడంతో లెటర్లు ఇచ్చిన మిల్లు ఓనర్లు మోసపోయారు.
బయటపడినా తగ్గని ఆఫీసర్లు
2023 అసెంబ్లీ ఎలక్షన్‌కు ముందు అప్పటి ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలోని సీఎంఆర్ వడ్ల స్కాం స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీంకు తెలియగా హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. వడ్ల స్టాక్‌లో గడిబిడ ఉన్నట్లు వారు అనుమానించగా అదేమీలేదని అక్కడి సరుకును ఇతర మిల్స్‌కు షిఫ్ట్ చేయించామని జిల్లా ఆఫీసర్లు పేపర్లు చూపగా వారంతా వెళ్లిపోయారు. కుంభకోణాన్ని వెలికితీయడానికి వచ్చిన స్టేట్ టీంకు ఆ టైంలో నిజం చెబితే సేఫ్ అయ్యేవారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత తిరిగి పవర్లో ఉంటారనే మితిమీరిన విశ్వాసం ఆఫీసర్ల కొంపముంచింది. 2023 ఎలక్షన్లో ఓడిన తరువాత షకీల్ ఆమెర్ దుబాయ్ వెళ్లిపోగా ఆయన అక్రమాలకు వత్తాసు పలికి పేపర్లు క్రియేట్ చేసిన ఆఫీసర్లపై కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ రైస్ ఇవ్వనందుకు రూ.10 కోట్ల ఫెనాల్టీ కలిపి మొత్తం రూ.80 కోట్ల విలువ వడ్ల స్కామ్ జరిగినట్లు కాంగ్రెస్ సర్కారు లెక్కతేల్చింది.