నిజామాబాద్, వెలుగు: బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రం లో సోమవారం నీలకంఠేశ్వరాలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమన్నారు. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ వైపే ప్రజలు ఉంటారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్పారు. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నందని ఆలయ కమిటీ అడిగారని ఇందు కోసం రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
సమయపాలన పాటించకుంటే చర్యలు : కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ, తప్పనిసరిగా హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో ఆయా అంశాలపై సమీక్ష జరిపారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ప్రజావాణికి ఉదయం 10.30 గంటలకు ముందే ఆఫీసర్లు రావాలని సూచించారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తూ వేతనాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలి జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించేందుకు మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మన ఊరు మన బడి కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే శుక్రవారం నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్షయ వ్యాధిగ్రస్థులకు తోడ్పాటు అందించాలి
నిజామాబాద్, వెలుగు: క్షయ వ్యాధిగ్రస్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో క్షయ వ్యాధిగ్రస్థులకు ఆయన పౌష్ఠికాహారం పంపిణీ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, దాతల తోడ్పాటుతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఎంహెచ్‌వో డాక్టర్ సుదర్శనం, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, నరేశ్, శ్యామల, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ టౌన్, వెలుగు: జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బీవీ.రమణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. రాములు, ఉపాధ్యక్షులుగా సీహెచ్.నాగ్య, జి.సాయికుమార్, టి.పుష్పలత, కార్యదర్శిగా బి.జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శులుగా ఎండీ.తాజుద్దీన్, ఎం.గణేశ్, ఐ.రాధ, ట్రెజరర్‌గా నవీన్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.రాజా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎన్. సాయికృష్ణ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియకు సహాయ ఎన్నికల అధికారిగా నర్సింహాచారి వ్యవహరించారని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని ట్రెజరీతో పాటు ఆయా శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.
ఎంబీబీఎస్ ర్యాంకర్‌కు సన్మానం
నిజామాబాద్ టౌన్: ఎంబీబీఎస్ సీటు సాధించిన హారికను ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆమె పైచదువులకు తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాస స్వామియాదవ్, నగర బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు సుధాకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.భరత్ భూషణ్, నాయకులు రాగి నారాయణయాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఘ్నేశ్ పాల్గొన్నారు.
కార్తీక శోభ
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల దీపోత్సవం, రథోత్సవాలు నిర్వహించారు. - వెలుగు, నెట్‌వర్క్
అమ్దాపూర్ కస్తూర్బాలో విద్యార్థులకు అస్వస్థత
బోధన్, వెలుగు: బోధన్ మండలం అమ్దాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల స్కూల్‌లో 8 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి అందోళనకరంగా ఉండడంతో అత్యవసర చికిత్స చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారం రోజుల నుంచి స్కూల్‌లో అనారోగ్యంతో ఉండడంతోనే అస్వస్థకు గురైనట్లు స్పెషల్ఆఫీసర్ హిమబిందు వైద్యులకు తెలిపారు. ఈ విషయం బోధన్ ఆర్డీవోకు తెలియడంతో గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే అమ్దాపూర్గ్రామస్తులు మాత్రం ఫుడ్ పాయిజన్‌తోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఫుడ్‌పాయిజన్ జరిగిందన్నారు. అధికారులు స్కూల్‌ను తనిఖీ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన విండో డైరెక్టర్లు
లింగంపేట, వెలుగు: వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం లింగంపేట సింగిల్‌విండో డైరెక్టర్లు స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ను కోరారు. కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో ఆయనను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు రాత్రింబవళ్లు నిరీక్షిస్తున్నారని వాపోయారు. దీంతో ఎమ్మెల్యే స్పందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. లింగంపేట సొసైటీకి ఎక్కువ లారీలను పంపించాలని సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లింగంపేట విండో వైస్‌చైర్మన్ మాకం రాములు, డైరెక్టర్లు సాయాగౌడ్, నీరడి రామలింగం, బోయిని సాయిలు, పోచయ్య, అట్టెం శ్రీనివాస్ ఉన్నారు.
బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా హైమద్
బోధన్, వెలుగు: బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా ఎండీ ఖమర్ హైమద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా పని చేసిన రామలింగం హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లో ఖమర్ హైమద్‌ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పాటుపడుతానని, తనకు అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్‌సిబ్బంది బొలతో ఆయనకు స్వాగతం పలికారు.