ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ధర్పల్లి, వెలుగు: రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను అందించేందకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఐడీసీ ఎంఎస్ చైర్మన్ సాంబారీ మోహన్ అన్నారు. ధర్పల్లి, రామడుగు, ఒన్నాజీపేట్ సొసైటీ పరిధిలోని మైలారం, చల్ల గర్గ, దుబ్బాక, దమ్మన్నపేట్, ధర్పల్లి, ఒన్పాజీపేట్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులను దళారుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారిక హన్మంత్‌‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌‌యాదవ్, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్లు రాజేందర్‌‌‌‌రెడ్డి( ఒన్నాజీపేట్​), చెలిమెల చిన్నారెడ్డి(ధర్పల్లి), రాజేందర్‌‌‌‌రెడ్డి( రామడుగు) పాల్గొన్నా రు.  

లింగంపేట మండలంలో..

లింగంపేట,వెలుగు: మండలంలోని నల్లమడుగు, లింగంపేట, లింగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎంపీపీ గరీబున్నీసా నల్లమడుగు, లింగంపేట సొసైటీ చైర్మన్లు సుప్పాల రమేశ్, దేవేందర్‌‌‌‌రెడ్డితో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులు తక్కువ ధరకు వడ్లను అమ్మి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచులు మంజుల, లావణ్య, బండి రాజయ్య, వైస్ చైర్మన్లు మాకం రా ములు, రాజు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. 

నవీపేట్‌‌ మండలంలో..

నవీపేట్, వెలుగు: రైతులు వడ్లను దళారులకు అమ్మొద్దని ఎంపీపీ శ్రీనివాస్ సూచించారు. నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర ఇస్తుందని చెప్పారు.  సొసైటీ చైర్మన్ శైలేశ్‌‌కుమార్, సర్పంచ్ స్వరూప మహిపాల్, డైరెక్టర్లు శ్రీనివాస్, శంకర్, జగ్గరం సెక్రటరీ రమేశ్‌‌,  శేఖర్, సాయిరాం పాల్గొన్నారు.

పిట్లం, బిచ్కుందలో..

పిట్లం, వెలుగు: పిట్లం, బిచ్కుందలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలును పిట్లంలో సొసైటీ చైర్మన్‌‌ శపథంరెడ్డి, బిచ్కుంద ఎంపీపీ అశోక్​పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులంతా తమ వడ్లను  కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని సూచింనచారు. కార్యక్రమంలో పిట్లం జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్​రెడ్డి, కోఆప్షన్ మెంబర్​ రహ్మన్, సీఈవో సంతోష్​రెడ్డి, నాయకులు విజయ్, నర్సాగౌడ్ పాల్గొన్నారు.

టీఏఎస్‌‌‌‌సీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి,  వెలుగు: తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ( టీఏఎస్​సీఏ) కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రెసిడెంట్‌‌‌‌గా ఎం.వీరయ్య, జనరల్​ సెక్రటరీగా చిట్లంపల్లి వెంకటి, వైస్ ప్రెసిడెంట్లుగా బి.లింగారెడ్డి, చంద్రాగౌడ్, బి.మంజుల, కార్యదర్శులుగా   కాసం రాజయ్య, కె.సిద్ధిరాములుగౌడ్, జి.రాజారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎస్.విఠల్‌‌‌‌రెడ్డి, ఎన్.వి.ఎన్ రెడ్డి, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా కె.శ్రీనివాస్, ఎగ్జిక్యూటీవ్​మెంబర్లుగా లక్ష్మీపతి, హన్మంత్‌‌‌‌రెడ్డి, ఈశ్వరయ్య, చీరంజీవులు,  నర్సింహులు, బి.ఆనంద్‌‌‌‌రావు, జి.కిషన్‌‌‌‌గౌడ్, రమేశ్, రాజామౌళి, చింతల యాదగిరి, సాయాగౌడ్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్‌‌‌‌కు చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా స్టేట్ ప్రెసిడెంట్ నర్సింహారావు హాజరై మాట్లాడారు.  

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

బోధన్, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకే ‘మన ఊరు మన  ఎమ్మెల్యే’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం మండలంలోని మినార్‌‌‌‌పల్లి, సంగెం, భవానిపేట్ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బోధన్ నుంచి మినార్‌‌‌‌పల్లి    వరకు బైక్  ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. బైక్‌‌పై వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామాల్లో నాయకులు, గ్రామస్తులు స్వాగతం తెలిపారు. భవానీపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. 2019 నుంచి నేటి వరకు భవానీపేట్‌‌లో రైతు బంధు పథకం ద్వారా 353 మందికి రూ.7.53 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. కల్యణలక్ష్మి, కేసీఆర్‌‌‌‌ కిట్‌‌, సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ ఏదో ఒక పథకం ప్రతీ గడపకు అందిందన్నారు. అనంతరం సంగెం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎపీపీ  బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్‌‌‌‌ లక్ష్మి, మార్కెట్​కమిటీ చైర్మన్‌‌ వి.ఆర్ దేశాయ్, డీసీసీబీ డైరెక్టర్లు గంగారెడ్డి, శరత్, టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు నరేంద్ర బాబు, కార్యదర్శి శిర్ప సుదర్శన్, మండల మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, భవానీపేట్ సర్పంచ్ కృష్ణకాంత్,  సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.  

తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు

నిజామాబాద్ టౌన్, వెలుగు: ఆన్‌‌లైన్‌‌ బిజినెస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారంటూ శిరంజిని అనే మహిళ తనపై, తన భర్త దండి వెంకట్‌‌పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు గాని, తన భర్త దండి వెంకట్‌‌కు గాని ఎలాంటి ఆన్‌‌లైన్ బిజినెస్ లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మరోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

తాడ్వాయిలో కంటి వైద్య శిబిరం

తాడ్వాయి, వెలుగు: మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలోని హైస్కూల్‌‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. క్యాంపునకు వచ్చిన వృద్ధులు, మహిళలకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ షౌకత్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, జయరాజ్, లింగ గౌడ్, భారత్ రెడ్డి, సజీత్ పాల్గొన్నారు. 

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు అప్లై చేసుకోండి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి గవర్నమెంట్​డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌‌ గెస్టు లెక్చరర్ పోస్టు కోసం నవంబర్​ఒకటి వరకు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్​కె.కిష్టయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్‌‌లో 55 శాతం మార్కులతో పీజీ పాస్ కావాలని, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సరిపోతుందన్నారు. అప్లయ్ చేసుకున్న వారికి 2న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

రోటరీ క్లబ్‌‌ ఆధ్వర్యంలో బ్లడ్ టెస్టులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో  డిగ్రీ స్టూడెంట్లకు బ్లడ్ గ్రూప్​ టెస్టులు  చేస్తున్నట్లు  క్లబ్ ప్రెసిడెంట్​ సిరిగాధ  లక్ష్మీ నర్సింహులు తెలిపారు. మన బ్లడ్​గ్రూప్​ ఏదో  తెలిస్తే అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్​ చేయటానికి అవకాశంఉంటుందన్నారు. సాందీపని డిగ్రీ కాలేజీలో క్యాంపు ఏర్పాటు చేసి 500 మంది స్టూడెంట్లకు టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. 

టీచర్ల ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలి

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వం టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌‌ను వెంటనే ప్రకటించాలని  టీపీటీఎఫ్ స్టేట్​ ప్రెసిడెంట్​వై.ఆశోక్‌‌కుమార్‌‌‌‌ డిమాండ్​ చేశారు. టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యవర్గ మీటింగ్ ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌‌కుమార్ మాట్లాడుతూ ఏడేళ్లుగా ప్రమోషన్లు లేకుండా,  నాలుగేళ్లుగా బదిలీలు లేకపోవడంతో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్కూళ్లలో స్కావెంజర్లను, విద్యావలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. సీనీయర్ ఉద్యమనేత టి.హన్మండ్లు మాట్లాడుతూ గవర్నమెంట్​ విద్యా రంగంపై బాధ్యతయుతంగా ఉండాలన్నారు.  విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో స్టేట్ మాజీ ప్రెసిడెంట్​కె.రమణ, ఉపాధ్యాయ దర్శిని ఎడిటర్​ కె.వేణుగోపాల్, జిల్లా ప్రెసిడెంట్ వై.సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ సి.హెచ్ అనిల్‌‌కుమార్‌‌‌‌, ప్రతినిధులు నాగభూషణం, నళినిదేవి, మీనాభూషణ్​, రూప్​సింగ్, పి.అంజయ్య, జగన్నాథం, లక్ష్మి పాల్గొన్నారు.  

కూలి 15 రోజులైనా పట్టింపు లేదు..

పిట్లం మండల కేంద్రంలో బుడగ జంగం కాలనీలోని కమ్యూనిటీ భవనం 20 రోజుల కింద కూలి పోయినా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. 25 ఏళ్ల కింద నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరినా రిపేర్లు చేయలేదన్నారు. భవనం గదిలో నిర్వహిస్తున్న అంగన్​వాడీ కేంద్రం నిర్వాహణకు సైతం ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. ఆఫీసర్లు స్పందించి కొత్తభవనం నిర్మించాలని కోరుతున్నారు. - పిట్లం, వెలుగు