నిజామాబాద్ జిల్లాలో మహా శివరాత్రి రోజు భక్తులు వింత ఆచారం పాటిస్తారు. శివుడికి యాటలు కోసి మొక్కులు తీర్చుకుంటారు. సిరికొండ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఒడ్డెర కులస్తులు పండగ రోజున పిల్లల పుట్టు వెంట్రుకలు తీసి మేకలు కోసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దశబ్దాలుగా ఇక్కడ శివరాత్రి రోజులు మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి ఉపవాసం విడుస్తారు.
సిరికొండ మండలం లంక రామలింగేశ్వర శివాలయానికి విశిష్టత ఉంది. రావణుడు చెర నుండి సీతను విడిపించేందుకు వెళ్తున్న శ్రీరాముడు ఇక్కడ పూజలు చేయడంతో శివుడు స్వయంభువుడిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. సిరికొండ, ధర్ పల్లి, భీంగల్ మండలాల్లోని వివిధ గ్రామాల ఒడ్డెర తెగ వారు రామలింగేశ్వర స్వామిని ఇష్ట దైవంగా ఆరాధిస్తారు. ఇలా యాటలు కోసి మొక్కులు తీర్చుకోవడం వల్ల ఎలాంటి కీడు దరిచేరదని వారు విశ్వసిస్తారు.
ఒక ఏడాది మహాశివరాత్రి రోజున మాంసాహార నేవైద్యం లేకుండా ఉపవాస దీక్ష చేయాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. అయితే ఆ ఏడాది వర్షాల్లేక గ్రామాల్లో కరువు వచ్చి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తప్పును క్షమించమని మళ్లీ మొక్కులు చెల్లించుకోవడంతో బాధలు తీరినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. శివరాత్రి రోజునే కాక మరుసటి రోజు కూడా మాంసాహార నైవేద్యం సమర్పించడం ఆచారంగా వస్తోంది.