నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్​ ఆఫీసర్ల నిర్బంధం

నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్​ ఆఫీసర్ల నిర్బంధం
  • ఆయకట్టు భూములకు సాగునీరు అందట్లేదని రైతులు ఆగ్రహం
  • వారం పాటు వదలుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
  • నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంప్ పంచాయతీ ఆఫీసు వద్ద ఘటన

బోధన్​,వెలుగు : నిజాంసాగర్​ చివరి ఆయకట్టు గ్రామాలకు సాగు నీరు అందకపోవడంతో  నిజామాబాద్ జిల్లాలో  ఇరిగేషన్​అధికారులను రైతులు శుక్రవారం నిర్బంధించారు. ఈనెల 21న నిజాంసాగర్ నీటిని 4వ విడతగా వదిలారు. వారం రోజులైన డి–28 కెనాల్ కింద చివరి ఆయకట్టు గ్రామాలైన కొప్పర్తి క్యాంప్​, కుమ్మన్పల్లి, సాలూర క్యాంప్​, జాడి జమాల్​పూర్, పత్తేపూర్​లోని వరి, మొక్కజొన్న పంటలకు నీరు అందడంలేదు.

దీంతో  ఇరిగేషన్​అధికారులు డీఈ భూమన్న, ఏఈలు శృతి, సత్యనారాయణ వద్దకు రైతులు వెళ్లి సాలూర క్యాంప్​ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి తాళం వేశారు. జిల్లాస్థాయి అధికారులు హామీ ఇచ్చేవరకు వదిలేదిలేదన భీష్మించారు. బోధన్​రూరల్​ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్​రెడ్డి వెళ్లి రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు.  అనంతరం ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డికి రైతులు సాగునీటిపై ఫిర్యాదు చేయగా వెంటనే ఇరిగేషన్ ఎస్ఈ రాజేశేఖర్ తో ఫోన్​లో మాట్లాడారు.  వారం రోజుల వరకు పంటలకు సాగునీటిని అందించేందుకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.