నిజామాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోలుకు గన్నీ బ్యాగుల షార్టేజ్​

నిజామాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోలుకు  గన్నీ బ్యాగుల షార్టేజ్​
  • లారీలు, హమాలీల కొరతతో అన్​లోడ్ సమస్యలు
  • స్టాక్ పెట్టే చోటులేక మిల్లర్లు పరేషాన్ 
  • ధాన్యం కాంటా పెట్టడానికి వారానికి మించి నిరీక్షణ

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోళ్లు జోరందుకోగా, గన్నీ బ్యాగ్​ల కొరత, లారీల సమస్య రైతులను వేధిస్తున్నది. పంట కోతలు ముగించిన అన్నదాతలు కాంటా పెట్టడానికి వారానికి మించి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కాంటాలు ముగిశాక రైస్​ మిల్లుల్లో స్థలం లేక బస్తాలు అన్​లోడ్​​ కావట్లేదు.  ధాన్యం కొనుగోలు విషయంలో సింగిల్​ విండోలు, ఐకేపీల నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. 

2 కోట్ల సంచులకు 1.20 కోట్ల సరఫరా..

యాసంగి సీజన్​లో జిల్లాలో 4.19 లక్షల ఎకరాల రికార్డు స్థాయిలో వరి పంట సాగైంది. ఎంఎస్​పీతో పాటు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ కోసం రైతులు సుమారు 4 లక్షల ఎకరాల్లో  సన్న రకం వరి పంట వేశారు.  ప్రభుత్వం 11.85 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి అంచనా వేసింది. 9 లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా,  లక్ష తగ్గించి 8 లక్షల టన్నులు కోనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను 664 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని భావించి 693 సెంటర్లకు పెంచారు. వాటిలో సింగిల్​ విండోలకు 426, ఐకేపీకి 237, డీసీఎంఎస్​కు 21, మెప్మాకు 9 సెంటర్లు అప్పగించారు. వడ్ల కొనుగోలుకు 2 కోట్ల గన్నీ బ్యాగ్​లు కావాలని ఎస్టిమేషన్ వేయగా కోటి 20 లక్షల బ్యాగులే జిల్లాకు చేరాయి. 

వడ్లు బాగా ఎండుతున్నయ్​.. 

కొనుగోలు కేంద్రాల్లో  గన్నీబ్యాగులు లేక రోజుల తరబడి కాంటా వేయడం లేదు. ప్రతి రోజు 6 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంటేనే కాంటాలు సాఫీగా సాగే వీలుండగా 3 లక్షల బ్యాగులే రొటేషన్ అవుతున్నాయి.  కాంటా అయిన వడ్ల బస్తాలు రైస్ మిల్స్​లో స్టాక్​ చేయడానికి చోటు లేక అన్​లోడ్ కావడానికి మూడు రోజులు సీరియల్​లో ఉంటున్నాయి. యాసంగిలో 216 మిల్లులకు మాత్రమే అధికారులు కేటాయించారు. అన్ని మిల్లుల్లోనూ వడ్ల స్టాక్​ నిండిపోయింది. పాత సీఎంఆర్ క్లియర్ అయితే గానీ చాలా రైస్​ మిల్స్​లో ఖాళీ ఏర్పడే వీలులేదు. పరిస్థితి మరింత క్లిష్టంగా మారకముందే వడ్లు స్టాక్​ చేయడానికి ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.  

రోజూ వంద లారీలు అవసరం..

కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లు రైస్ మిల్స్​కు చేర్చడానికి జిల్లాలోని పది సెక్టార్లలో పది మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక్కో కాంట్రాక్టర్ 80 నుంచి 100 లారీల చొప్పున సీజన్​లో సుమారు వెయ్యి లారీలు రెడీ చేసేలా అధికారులు అగ్రిమెంట్ చేశారు. ప్రతి రోజు కనీసం వంద లారీలు అందుబాటులో ఉంటేనే సెంటర్ల నుంచి స్టాక్ షిప్టింగ్​ జరుగుతుంది. 

అయితే 50 లారీలతోనే రొటేషన్ నడుస్తుంది. ఈ  కొరతకు తోడు అన్​లోడ్​కు ​ వెళ్లిన వెహికల్స్ మూడు రోజులు క్యూలో ఉండడంతో సమస్య తీవ్రమవుతుంది. సింగిల్​ విండోల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో హమాలీలు, ఐకేపీ కేంద్రాలకు వెళ్లకపోవడంతో సెంటర్లలో కాంటాలు వేయడం జాప్యం జరుగుతోంది. టైంకు కొనుగోలు చేయకపోవడంతో విసుగు చెందిన రైతులు పోతంగల్ మండల కేంద్రంలో 23న రాస్తారోకో చేశారు. అంతకు ముందు ఎత్తొండ సింగిల్ విండో ఆఫీస్​కు తాళం వేశారు.  

ఇప్పటివరకు కొనుగోలు చేసింది...

ఇప్పటి వరకు జిల్లాలో 4.75 లక్షల మెట్రిక్​ టన్నులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  అందులో 4.44 లక్షల మెట్రిక్​ టన్నులు సన్నరకం వడ్లు  ఉండగా, దొడ్డు రకం వడ్లు కేవలం 31 వేల టన్నులు కొనుగోలు చేశారు. ముందస్తుగా నాట్లు వేసిన పంటలతో పాటు ఆలస్యంగా నాట్లు వేసిన వరి పంట కోతకు వచ్చాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోయాయి. 

15 రోజుల నుంచి ఎదురుచూస్తున్న

ఎనిమిదెకరాల వరి కోసి  15 రోజులు దాటింది. ఒక గింజ కూడా కాంటా కాలేదు. గన్నీ బ్యాగుల కొరత ఒకసారి, హమాలీల షార్టేజ్ అని మరోసారి, రెండూ తీరాక లారీలు లేవని సెంటర్​ నిర్వహకులు చెబుతున్నారు. ఆందోళనలు చేసినా సమస్య తీరడంలేదు. వడ్ల రాశులు, బస్తాలు రోడ్లపైనే ఉంటున్నాయి.జగదీష్​, రైతు ఎత్తొండ

కొనుగోళ్లు పీక్​ స్టేజ్​లో ఉన్నందున సమస్య

జిల్లా అంతటా వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఒకేసారి గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలకు డిమాండ్​ ఏర్పడడంతో కొంత సమస్య తలెత్తుతుంది. ఎక్కడా ఇబ్బంది రాకుండా మానిటరింగ్​ చేస్తున్నాం. మరో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మూడు వారాల్లో వచ్చేలా కనబడుతుంది. సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. 

శ్రీకాంత్​రెడ్డి, డీఎం, సివిల్​ సప్లయ్​