- హాస్పిటల్‌లో బర్త్‌డే వేడుక వివాదమే కారణం..?
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జీజీహెచ్సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌ను తప్పిస్తూ ప్రిన్సిపల్సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో పి.శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ విచారణ చేసి స్టేట్హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈనెల 11న ప్రతిమారాజ్ హాస్పిటల్ మీటింగ్ హాల్లో తన బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. డ్యూటీ టైంలో ఈ వేడుక నిర్వహించగా జీజీహెచ్ స్టాఫ్ అంతా అటెండ్ అయ్యారు.
దీనివల్ల హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేతావత్ బద్యానాయక్ అనే వ్యక్తి తన భార్యకు ఫిట్స్ రాగా హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో భుజంపై ఎత్తుకొని ఏడంతస్తుల హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కగా, రోగులను పట్టించుకోకుండా సూపరింటెండెంట్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం ఏంటని సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రభుత్వం స్పందించి డీఎంఈ ఎన్.వాణిని విచారణకు ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.