నిజామాబాద్ ఆస్పత్రిలో ఏం జరిగిందంటే..

నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనపై సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ స్పందించారు. లిప్ట్ వచ్చిందనే తొందరలో రోగి బంధువులే అలా లాక్కెళ్లారని స్పష్టం చేశారు. అలా లాక్కొని వెళుతున్న క్రమంలో అటెండర్లు చూసి వారిని తిట్టి.. వీల్ ఛైర్లో పేషెంట్ ను ఎక్కించుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. కేవలం ఆసుపత్రిని నిందించడానికే సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డాురు.   వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సూపరింటెండెంట్ తెలిపారు.  

ఈ ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక అందజేయాల్సిందిగా డీఎంఆర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు.   నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గత నెల  మార్చి31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రి రెండో అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా.. అక్కడ స్ట్రెచర్‌ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. లిఫ్ట్‌ వరకు రోగి కాళ్లుపట్టుకుని బంధువులు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.