నిజామాబాద్, వెలుగు: కొత్త కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ఆయన ఐటీ హబ్ పనులను పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని చెక్ చేసిన ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు.
ఇప్పటికే పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు డీలే చేస్తున్నారని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై జాప్యానికి ఎంత మాత్రం తావులేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని యుద్ధ ప్రాతిప దికన పూర్తి చేయాలని ఆదేశించారు.ఎక్కువ సంఖ్య లో వర్కర్లను ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు పను లు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అలసత్వం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజువారీగా పనుల ప్రగతిని పరిశీలిస్తూ తనకు నివేదికలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయించి ఐటీ హబ్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఐటీ హబ్‌కు చేరువలోనే నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను సైతం ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగవంతంగా చేపట్టి జనవరి 15 నాటికి కంప్లీట్ చేయాలని సంబం ధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పద్మశాలీ భవన్‌కు రూ.25 లక్షలు మంజూరు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో నిర్మిస్తున్న పద్మశాలీ కమ్యూనిటీ హాల్ పనులను రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రకటించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా సోమవారం భవన నిర్మాణం పనులను ఆయన పరిశీలించి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను పద్మశాలీ ప్రతినిధులకు అందజేశారు.
ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.2.80 లక్షలను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ నెల 26 వరకు కమ్యూనిటీ హాల్‌కు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్నా, కమిషనర్ జగదీశ్ గౌడ్, ఏఈలు నితీశ్, రఘు, కౌన్సిలర్ బండారి ప్రసాద్, పద్మశాలీ కమిటీ సభ్యులు రాంపూర్ గంగాధర్, అంబల్ల శ్రీనివాస్, గుజ్జేటి రాము, రష్యా నర్సయ్య, విజ్ఞేశ్, బిజ్జు దత్తాత్రి, యజ్ఞేశ్, సదాశివ్ పాల్గొన్నారు.
బడి బయట పిల్లల గుర్తింపు
లింగంపేట, వెలుగు: మండలంలోని జల్దిపల్లి శివారులో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న వలస కూలీ లకు చెందిన ఏడుగురు బడి బయట పిల్లలను గుర్తిం చి బడిలో చేర్పించినట్లు లింగంపేట జడ్పీ హెచ్ఎస్ బాలికల హైస్కూల్ హెచ్‌ఎం బాలమణి తెలిపారు. సోమవారం జల్దిపల్లి స్కూల్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వలస కూలీలు ఇటుక బట్టీల్లో పనులు చేస్తుండగా వారి పిల్లలు పనుల వద్ద ఉంటున్నట్లు గుర్తించారు. ముగ్గురు పిల్లలను స్కూల్‌లో, మరో ముగ్గురు పిల్లలను బామనమ్మతండా అంగన్వాడీ కేంద్రంలో, మరొకరిని భవానీపేట హైస్కూల్‌లో చేర్పిం చినట్లు చెప్పారు. ఆమె వెంట జల్దిపల్లి హెచ్‌ఎం సౌజన్య, టీచర్ పర్వయ్య, సీఆర్పీ సత్యనారాయణ ఉన్నారు.
అర్హులందరినీ ఓటరు లిస్ట్‌లో చేర్చాలి: ఎలక్షన్ అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా
కామారెడ్డి, వెలుగు: అర్హత ఉన్న ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని ఎలక్షన్ అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఆయన ఓటర్ల జాబితా సవరణపై కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి అప్లికేషన్లు స్వీకరించాలన్నారు. టౌన్ ఏరియాలో ఓటర్ల ఎంట్రీపై స్పెషల్ ఫోకస్ చేయాలన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 6,18,204 మంది ఓటర్లు ఉన్నారని, 790 పోలింగ్‌బూత్‌లు ఉన్నాయన్నారు. అంతకుముందు రాజంపేట మండలం పొందూర్తిలో పోలింగ్ కేంద్రాన్ని ఎక్కా పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీవోలు శీను, శ్రీనివాస్‌రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ సాయి భుజంగ్‌రావు పాల్గొన్నారు.
పుకార్లను నమ్మొద్దు.. పెద్ద బజారు ఘటనపై పోలీసుల ఫైర్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నగరంలోని పెద్ద బజారులో జరిగిన ఘటనపై పుకార్లను నమ్మొద్దని, అది కేవలం ఫైర్ యాక్సిడెంట్ అని సీపీ నాగరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోమవారం వెల్లడించారు. పెద్ద బజారులోని కిరణా షాపు యజమాని రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 10న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఖాళీ సీసాలు ఏరుకునే శంకర్ గౌడ్ అనే వ్యక్తి టర్పెంట్ ఆయిల్ డబ్బాను పక్కన పెట్టుకుని బీడీ ముట్టించడంతో పేలుడు సంభవించినట్లు తెలిపారు. క్లూస్ టీం బ్లాస్టింగ్ కారణమైన శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్‌కు పంపినట్లు చెప్పారు. దీంతో పాటు సీసీ ఫుటేజ్ ద్వారా బలమైన సాక్ష్యాలు సేకరించినట్లు వివరించారు. ఈ ఘటనలో ఎటువంటి సంఘ విద్రోహశక్తులు లేవని, ఎవరైనా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేసి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నగర ఏసీపీ వెంకటేశ్వర్, టూ టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనపై విసిగిపోయారు: డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడిగా రెండో సారి నియమితులైన ఆయన సోమవారం డీసీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పాలకుల వైఫల్యాలపై జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ దండయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాలను మోసగించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. ఓ వైపు రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంటుంటే.. మరో వైపు సంక్షేమ పథకాల్లో ఆ పార్టీ లీడర్ల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తమకు అవకాశం ఇచ్చిన ఆలిండియా ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్గే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందిన నేతలు సుదర్శన్‌రెడ్డి, బొమ్మ మహేశ్, మధుయాష్కీ గౌడ్‌కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామర్తి గోపి, ఎన్ఎస్‌యుఐ జిల్లా ప్రెసిడెంట్ వేణురాజ్, జిల్లా పబ్లిసిటీ కమిటీ కన్వీనర్ జావీద్ అక్రమ్, మహిళా కాంగ్రెస్ నేతలు ఉషా, తంబాకు చంద్రకళ, మఠం రేవతి, కార్పొరేటర్ గడుగు రోహిత్, అర్బన్ చందూర్ ఎంపీపీ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి
బాన్సువాడ, వెలుగు: ప్రజలకు మెరుగైన పాలన సౌలభ్యం కోసం బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల ఏర్పాటులో బాన్సువాడకు అన్యాయం జరిగిందన్నారు.
నియోజకవర్గానికి చుట్టు పక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 22 మండలాలు ఉన్నాయని, బాన్సువాడకు 22 మండలాలతో జిల్లా ఏర్పాటు అయితే జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సౌలభ్యకంగా ఉంటుందన్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ జిల్లా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. బాన్సువాడ జిల్లా కోసం ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, నాయకులు చిదుర సాయిలు, కోణాల గంగారెడ్డి, శ్రీకాంత్, హన్మండ్లు యాదవ్, రాజాసింగ్, పోల్కం గోపాల్, విశాల్, సిద్ది బాలరాజ్, రాము శ్రీకాంత్, రామకృష్ణ పాల్గొన్నారు.
రెండు కాళ్లు లేవు సారూ..కనికరించండి
కామారెడ్డి, వెలుగు: కళ్ల ముందు కనిపిస్తున్న నిజం కన్నా.. కాగితాలకే ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్ట కరం. 16 ఏళ్ల తమ్ముడిని చంటి పిల్లాడిలా ఎత్తుకుని ఆ అక్క ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నా.. సార్లు కనికరించడం లేదు.. కరుణించడం లేదు.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన మామిడిగారి రాధ, లచ్చయ్యకు కొడుకు నవీన్, బిడ్డ గౌతమి ఉన్నారు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది.
అక్కే అన్ని తానై తమ్ముడి ఆలన పాలన చూసేది. గౌతమిని భిక్కనూరు మండలం జంగంపల్లి వాసి అంజయ్యతో పెండ్లి జరిగింది. ఆ టైంలో తమ్ముడు నవీన్‌ను చుట్టాలు పెంచుకోవడానికి తీసుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఇతడి కాళ్లు, చేతులు చచ్చుబడి పోయి నడవలేని స్థితికి వచ్చాడు. దీంతో బంధువులు బాలుడిని అక్క దగ్గర వదిలిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న నవీన్‌ను పలు హాస్పిటళ్లలో చూపించినా ఫలితం లేదు.
కరోనాకు ముందు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో చేర్పించారు. కరోనా టైంలో అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్లీ తన దగ్గరే ఉంచుకుంటోంది గౌతమి. సాధారణ కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు. దివ్యాంగుడిగా ఉన్నప్పటికీ ఫించన్ రావడం లేదు. సోమవారం తమ్ముడిని ఇలా ఎత్తుకుని కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చింది. ఫించన్ ఇప్పించాలని విన్నవించింది. సదరం సర్టిఫికెట్ లేనందున ఫించన్ ఇవ్వలేమని, జిల్లా హాస్పిటల్‌లో సదరం క్యాంపు ఏర్పాటు చేసినప్పుడు సమాచారం ఇస్తామని ఆఫీసర్లు చెప్పారని గౌతమి వాపోయింది.
శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ
బోధన్, వెలుగు: అదృశ్యమై అస్థిపంజరమైన కనిపించిన మండలంలోని ఖండ్‌గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మేడపాటి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్ మిస్సింగ్ అయి 80 రోజుల తర్వాత దొరకడం పోలీసుల నిర్లక్ష్యమేనన్నారు. పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బీజేపీ నియోజకవర్గ నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, మండల అధ్యక్షుడు పోశెట్టి పరామర్శించిన వారిలో ఉన్నారు.
ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దు
నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దని అఖిల పక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి నాయకులతో మాట్లాడుతూ ప్రస్తుతం కూలుస్తున్న భవనాల స్థలాల్లో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, క్రీడాప్రాంగణం, కళాభవన్ తో పాటు సుందరవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఒలంపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నర్సయ్య, సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, బీఎల్ఎఫ్ లీడర్లు పి.సుధాకర్, రమేశ్‌బాబు, వనామాల కృష్ణ, దండి వెంకట్ తదితరలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పిట్లం, వెలుగు: మద్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రారంభించారు. సోమవారం మద్నూర్‌లో రూ.13 లక్షలతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.1.70 కోట్లతో బాయ్స్ ప్రైమరీ, హైస్కూల్, ఉర్దూ మీడియం పాఠశాల లో నిర్మించే అదనపు గదుల నిర్మాణ పనులు, మెగా పార్క్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ స్టూడెంట్లు, నిరుద్యోగ యువకులు లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను లైబ్రరీలో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ సంగీత, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ సంగమేశ్వర్, లైబ్రేరియన్ గూడ రాజు, నాయకులు విఠల్, శివాజీ, పండిత్‌రావు, హన్మాండ్లు, సాయిలు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
బిచ్కుంద మండలం కందర్‌పల్లిలో ఏర్పాటు చే సిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, సర్పంచ్ గంగారాం, ఎంపీటీసీ శీలా యాదవరావు, సాయిరాం, రాజు పాల్గొన్నారు.
కామారెడ్డి, వెలుగు: ఊళ్లలో నాటిన మొక్కలు ఎండిపోతే కింది స్థాయి ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు తమ ఆఫీసులోనే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటిన మొక్కలు, గడ్డి ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకు నిదర్శనమే ఈ ఫొటోలు..
మొక్కలు ఎండిపాయే.. గడ్డి వాడిపాయే..!
కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణ, ముందు భాగం ఆహ్లాదకరంగా ఉండేందుకు రూ.లక్షలు వెచ్చించి పూల మొక్కలు, గడ్డి నాటారు. మెయింటనెన్స్ లేకపోవడంతో అవి ఎండిపోయి పచ్చదనం కరువైంది. మొక్కల సంరక్షణ విషయంలో యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలకు దారితీస్తోంది.