ఎన్నికల కోడ్​ అతిక్రమిస్తే కఠిన చర్యలు : రాజీవ్​గాంధీ హన్మంతు

డిసెంబర్​ 5వ వరకు ఎన్నికల కోడ్​
సభలు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరి
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
కలెక్టర్లు రాజీవ్​గాంధీ హన్మంతు, జితేశ్​వీ పాటిల్​ 

నిజామాబాద్, వెలుగు: జిల్లా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా రిటర్నింగ్​ ఆఫీసర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, డిసెంబర్​5వ వరకు కొనసాగుతుందని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రిటర్నింగ్ ​ఆఫీసర్ల పర్మిషన్ లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

జిల్లాలోని అన్నీ సెగ్మెంట్లలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ , వీడియో సర్వేలెన్స్, ఎంసీఎంసీ, సోషల్​మీడియా టీమ్​లు పనిచేస్తాయన్నారు. నవంబర్ 3  నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 13,65, 811 ఓటర్లు ఉన్నారని, 1549 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో  800 సర్వీసు ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.  సవరణలో భాగంగా కొత్తగా 53,653 మంది ఓటర్లను చేర్చినట్లు పేర్కొన్నారు. వివిధ కారణాలతో 8,938 ఓటర్ల పేర్లను లిస్టు నుంచి తొలగించామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో మహిళలకు 5, యూత్​కు ఒకటి, వృద్ధులకు ఒకటి చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని, ఎక్కడైనా ఉల్లఘనలు జరిగినట్లు తెలిస్తే1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. సి-విజిల్ యాప్​ను ఉపయోగించి కోడ్ ఉల్లంఘనల లైవ్ ఫోటోలు, వీడియోలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లొచ్చన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన అయిదు రోజుల్లోపు 2-డీ ఫారం భర్తీ చేసి బీఎల్వోలకు అందజేయాలన్నారు. కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి బందోబస్త్ పెడతామని, మైక్రో అబ్జర్వర్స్​పరిశీలిన కొనసాగుతుందన్నారు.  అడిషనల్ ​కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాం పాల్గొన్నారు.

కామారెడ్డి: ఎన్నికల షెడ్యూల్​వచ్చినందున జిల్లాలో ఎన్నికల కోడ్ ​అమల్లోకి వచ్చిందని కలెక్టర్​జితేశ్​వీ పాటిల్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ..  జిల్లాలో 6,61,163 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 791, బాన్సువాడ 122 పోలింగ్​స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్​ స్వ్కాడ్స్​ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఓటర్​గా నమోదైన ప్రతిఒకరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అడిషనల్​కలెక్టర్​చంద్రమోహన్​ పాల్గొన్నారు. మాడల్​కోడ్​ఆఫ్​కండక్ట్ ను కచ్చితంగా అమలు చేయాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్ సూచించారు. సోమవారం తహసీల్దార్లు, నోడల్​ఆఫీసర్లతో ఆయన వీసీలో మాట్లాడారు. గవర్నమెంట్​బిల్డింగులపై ఉన్న పార్టీల ప్రచార పోస్టులు, ఫ్లెక్సీలను 24 గంటల్లో తొలగించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని 
సూచించారు.