కామారెడ్డి, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో రైతులు ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చిన వారిని మెయిన్ గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సేపు అక్కడే ఆందోళన చేశారు. తర్వాత కలెక్టరేట్ కారిడార్‌లో బైఠాయించారు. రుణమాఫీ చేయాలని, పంటల బీమా కల్పించాలని, అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని, ఫారెస్టు సమీపంలో ఉన్న రైతుల పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించాలని, వడ్ల కొనుగోలు పక్రియ సక్రమంగా చేపట్టాలని, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని, ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐదుగురు ప్రతినిధులు ప్రజావాణిలో ఉన్న కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ తమ సమస్యలు వినకుండా వెళ్లిపోయారంటూ లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రెసిడెంట్ లొంక వెంకట్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పైడి విఠల్‌రెడ్డి, స్టేట్ సెక్రటరీ ఆనంద్‌రావు, ప్రతినిధులు అంజన్న, సతీశ్, రాజ్‌కుమార్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరు
నిజామాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ చెప్పారు. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి అరవింద్ మీనన్‌ను సోమవారం ఆయన హైదరబాద్‌లో కలిసారు. ఈ సందర్భంగా అర్బన్‌లో పార్టీ పరిస్థితి ధన్‌పాల్ వారికి వివరించారు. ఎంపీ అర్వింద్ దిశానిర్ధేశంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, కేంద్రంలో సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
దొంగ అరెస్టు 11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల చోరీలకు పాల్పడిన దొంగను అరెస్టు చేసి అతడి నుంచి రూ.11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన ఆఫీసులో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, మధురనగర్ కాలనీలో ఈనెల 5న పప్పుల ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. సీసీ టీవీలో రికార్డు అయిన వీడియో ఆధారంగా దేవునిపల్లి సద్దురు కాలనీకి చెందిన పాత నేరస్తుడు బిక్కాజి రంజిత్‌రావును అరెస్టు చేసి విచారించగా ఐదు ఇండ్లలో జరిగిన చోరీల వివరాలు తెలిపినట్లు చెప్పారు. ప్రసాద్ ఇంటితో పాటు మధురానగర్, విద్యానగర్ కాలనీల్లో జరిగిన చోరీల్లో రూ.11 లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. రంజిత్‌రావుపై గతంలో కామారెడ్డి, దేవునిపల్లి పోలీస్స్టేషన్లతో పాటు మేడ్చల్, షెట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్, దేవునిపల్లి ఎస్సై ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకు దోపిడీ కేసులో ఒకరి అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్/ మెండోరా, వెలుగు: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో ఇటీవల బ్యాంకు దోపిడీకి పాల్పడిన ముఠాలో ఒకరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీపీ కె.ఆర్ నాగరాజు ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి కేసు విచారణలో భాగంగా తన సిబ్బందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీ చేయగా అనుమానంగా తిరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరెల్లికి చెందిన రాజును అరెస్టు చేశారు. అతడిని విచారించగా బుస్సాపూర్ బ్యాంకు దోపిడీ కేసులో మొత్తం 19 మంది పాల్గొన్నట్లు తెలిపినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు రాజును రిమాండ్ తరలించడంతో పాటు మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ కేసును ఛేదించడంలో కీలంగా పనిచేసిన ఆర్మూర్ ఏసీసీ ప్రభాకర్‌రావు, సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, గోపిని సీపీ అభినందించారు. కాగా, స్సాపూర్ బ్యాంకు దోపిడీలో బంగారం కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని సోమవారం ఆందోళనకు దిగారు. బ్యాంక్‌లో దాచుకున్న బంగారాన్ని తమకు తిరిగి ఇవ్వాలని నేషనల్ హైవే 44 పై రాస్తారోకో చేపట్టారు. ఎస్సై శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుమని నచ్చజెప్పి పంపించారు.
42 బైకులు స్వాధీనం
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పార్క్ చేసిన బైకులను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో సీపీ నాగరాజు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని హష్మీ కాలనీకి చెందిన సమదుద్దీన్, మహమ్మదీయ కాలనీకి చెందిన షేక్ రియాజు ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తూ నగరంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి ఇది వరకే జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకుల చోరీకి పాల్పడ్డారు. బాన్సువాడ పట్టణం తాడ్కోలుకు చెందిన టూ వీలర్ ఫైనాన్స్ వ్యాపారి, హైదరాబాద్ శాస్త్రి కాలనీకి చెందిన అద్నాన్ బీన్‌తో కలిసి దొంగిలించిన వాహనాలను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో విక్రయించారు. నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ సమదుద్దీన్‌ను విచారించగా దొంగతనాలు బయటకొచ్చాయని చెప్పారు. సమదుద్దీన్‌తో పాటు షేక్ రియాజ్, మహమ్మద్ అబ్బాస్, అద్నాన్ బీన్ ఒమర్‌ను సోమవారం రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. వీరి నుంచి 42 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ శ్రీశైలం, రెండో టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ పాల్గొన్నారు.
సిద్దుల గుట్టపై అన్నదానం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు సందర్శించారు. గుట్టపైన ఉన్న రామాలయం, శివాలయం, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామాలయం నుంచి జీవ కోనేరు వరకు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తల్లిదండ్రులు రాజవ్వ, వెంకట్రావ్, ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌రెడ్డి, బి.సుమన్, పీసీ గంగారెడ్డి, బి.కిషన్, కొడిగెల మల్లయ్య, నక్కల లక్ష్మణ్, ఆనంద్ పాల్గొన్నారు.
మాజీ జడ్పీటీసీని పరామర్శించిన జడ్పీ చైర్మన్
మాక్లూర్, వెలుగు: గంగరమంద గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ గోపాల్ నగేశ్‌ను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు సోమవారం పరామర్శించారు. నగేశ్ తండ్రి ఈ నెల 4న చనిపోయారు. జడ్పీచైర్మన్ వెంట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏటిఎస్ శ్రీనివాస్, కేసీఆర్ సేవాదళ్ అధ్యక్షుడు బీరెల్ల రమణారావు, టీఆర్ఎస్ నాయకులు అంజయ్య, మనోహర్, రాజేశ్వర్, మోహన్ ఉన్నారు.
తహసీల్దార్ ఆఫీసులకు తాళం
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసులకు తాళాలు వేసి బైఠాయించారు. ఆఫీసర్లు, స్టాఫ్‌ను లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో అన్ని కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర పాలన ఆంశాలు స్తంభించాయి. - వెలుగు, నెట్‌వర్క్
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
నిజామాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 77 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్‌కు విన్నవించారు. అర్జీలను పరిశీలించిన వారు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.
కామారెడ్డిలో 24 ఫిర్యాదులు..
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని ఆయా ఏరియాల నుంచి వచ్చి సమస్యలపై విన్నవించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, ఆఫీసర్లు ఫిర్యాదులు స్వీకరించారు. 24 ఫిర్యాదులు వస్తే ఇందులో భూ సమస్యలపై 14 ఉన్నాయి. ఫిర్యాదులపై పరిశీలన చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల ఆఫీసర్లకు ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
నవీపేట్, వెలుగు: ఇటీవల వివిధ కారణాలతో చనిపోయిన మృతుల కుటుంబాలను సోమవారం బీజేపీ లీడర్లు పరామర్శించారు. బోధన్ నియోజకవర్గ లీడర్, స్టేట్ రైస్ మిల్లర్ సెక్రటరీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కలిసి జన్నేపల్లి, సిరన్‌పల్లి, లింగాపూర్ విలేజ్‌లో మృతి చెందిన ఫ్యామిలీలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి వెంట పార్టీ ప్రెసిడెంట్ ఆదినాథ్, మాజీ సర్పంచులు రచ్చ సుదర్శన్, అంజాగౌడ్, ఆనంద్, మల్లెపూల గంగాధర్, గంగాధర్ ఉన్నారు.
సారూ.. కనికరించండి..!
దివ్యాంగురాలైన ఆ వృద్ధురాలు పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న వారే లేరు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన సైదులు, బీబీ జాన్ భార్యభర్తలు. గుంటూరు జిల్లాకు చెందిన వీరు 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. బీబీ జాన్‌కు నాలు గేళ్ల కింద కుడి కాలుకు మొల గుచ్చడంతో సెప్టిక్ అయ్యింది. 77 శాతం దివ్యాంగురాలు అని సదరం క్యాంపు–2021లో సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఆమె దివ్యాంగుల పెన్షన్‌కు అప్లై చేసుకుంది. ఇటీవల కొత్తగా పింఛన్లు శాంక్షన్ అయినప్పటికీ బీబీ జాన్‌కు మాత్రం రాలేదు. భార్యకు దివ్యాంగుల ఫించన్ శాంక్షన్చేయాలని కోరుతూ సైదులు మరోసారి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో విన్నవించారు. ఆఫీసర్లు పరిశీలన చేస్తామని చెప్పి పంపారు. –కామారెడ్డి , వెలుగు
అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
మోర్తాడ్, వెలుగు: మండల కేంద్రంలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా కమ్మర్‌పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి సారా సురేశ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయినా ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఇండ్ల పేరుతో పేదల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా లీడర్లు జి.కిషన్, అశోక్, లక్ష్మక్క, రాములు, గంగు, నాగమణి, బాలయ్య, గంగయ్య పాల్గొన్నారు.
కాలనీ సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని యానం గుట్ట వద్ద ఉన్న సుందరయ్య కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం లీడర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్‌కు మెమోరాండం అందజేశారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, ఆరేళ్ల నుంచి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. తాగునీటి వసతితో పాటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు రవి, నాగరాజు, షాహిద్ బేగం, ఫిరోజ్, రహమాన్ కాలనీవాసులు పాల్గొన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే షకీల్
బోధన్, వెలుగు: బోధన్ ఎమ్మెల్యే షకీల్ సోమవారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్, రెంజల్ మండలాలకు కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని, మార్కెట్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. బోధన్, సాలూరా, ఎడపల్లి, బోధన్టౌన్లకు ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని, రెంజల్, ఎడపల్లి మండలాలకు అడిషనల్‌గా 5 వేల మెట్రిక్‌టన్నుల గోదాంలు సాంక్షన్ చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.