గడువు పెంచినా.. ఎల్​ఆర్​ఎస్​ సజావుగా సాగేనా !

గడువు పెంచినా.. ఎల్​ఆర్​ఎస్​ సజావుగా సాగేనా !
  • నిజామాబాద్​లో స్పెషల్​ ఫోకస్ అవసరం
  • బోధన్​లో నిర్లక్ష్యానికి తోడు వసూళ్లు 
  • అప్లికేషన్లు తక్కువున్న భీంగల్, ఆర్మూర్​లో స్పీడ్ పెంచాలె
  • విలేజ్ లలో టెక్నికల్ ఇష్యూలు మారిస్తేనే రిజల్ట్

నిజామాబాద్, వెలుగు : నాన్​లేఅవుట్, ఇంటి జాగల రెగ్యులైజేషన్​కు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది.  దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సరిచేయకుండా నిర్లక్ష్యం చేస్తే  గడువు పెంచినా లాభముండదు. 25 శాతం రిబేట్​తో గవర్నమెంట్​ ప్రకటించిన రెగ్యులైజేషన్​ను సక్సెస్ కావడానికి కలెక్టర్​ లేక మరో ఉన్నతాధికారి ఆధ్వరంలో రోజువారీగా రివ్యూ చేయాలి. మున్సిపాలిటీలలో కంప్లైంట్​ బాక్స్​లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  గ్రామాల్లో నత్తనడకన సాగుతున్న ఎల్ఆర్ఎస్​పై  ప్రత్యేక ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

కార్పొరేషన్​లో స్టాఫ్​ పెంచాలి..

2020 అక్టోబర్​లో రూ.వెయ్యి  ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకే  25 శాతం రాయితీతో రెగ్యులైజ్ చేస్తున్నారు. ఆ రకంగా నిజామాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​లో ఎల్ఆర్ఎస్​ కోసం 33,729 దరఖాస్తులు రాగా, 23066 అప్లికేషన్లను ఎల్​ఆర్​ఎస్​ అర్హమైనవిగా గుర్తించారు.  మార్చి​ నెలాఖరు వరకు కేవలం 4,078 మంది రూ.29.81 కోట్లు పేమెంట్ చేశారు. మిగిలిన దరఖాస్తులను రెగ్యులరైజ్​ చేయాలంటే ఇప్పుడున్న స్టాఫ్​ను పెంచాలంటున్నారు.  

బోధన్​ తీరుమార్చకుంటే కష్టం..

నాన్​లేఅవుట్​ ప్లాట్​ ఓనర్ల కష్టాలు గట్టేక్కించేందుకు గవర్నమెంట్ పూనుకోగా బోధన్​ మున్సిపాలిటీలో దరఖాస్తుదారుల నుంచి స్టాఫ్​ లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. రూ.వెయ్యి ఇవ్వకుంటే కొర్రీలు పెట్టి బేజారు చేస్తున్నారు. అక్కడి టీపీబీ వెంకటేశ్​పై కమిషనర్ వెంకటనారాయణకు దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. బోధన్​లో 13,898 అప్లికేషన్​లలో 12,150 దరఖాస్తుదారులు రెగ్యులైజేషన్​కు అర్హత పొందాయి. వీటిలో 1,112 అప్లికేషన్ల నుంచి రూ.3.33 కోట్ల ఇన్​కమ్​ సమకూరింది.

దరఖాస్తులు తక్కువే..

భీంగల్ మున్సిపాలిటీలో 1,425 నాన్​లేఅవుట్  ప్లాట్ల రెగ్యులైజేషన్ దరఖాస్తులలో 967 అప్లికేషన్లకు ఎలిజిబులిటీ తేలింది. ఇప్పటివరకు  169 జాగలకు సంబంధించి రూ. 56 లక్షల ఫీజు వసూలైంది. ఆర్మూర్​ బల్దియాలో మొత్తం 4,125 అప్లికేషన్లకు 3,118 ఎల్ఆర్ఎస్​ అర్హత ఉంది. మార్చ్ నాటికి 699 దరఖాస్తులు మాత్రమే క్రమబద్ధీకరణ కాగా,  రూ.3.99 కోట్ల ఆదాయం సమాకూరింది. గత నెల వరకు ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ టార్గెట్​లో మునిగి ఎల్ఆర్​ఎస్​ను స్టాఫ్​ పెద్దగా పట్టించుకోలేదు. 530 గ్రామ పంచాయతీల పరిధిలోని 19 వేల దరఖాస్తులలో ఇప్పటి దాకా పది శాతం ఎల్ఆర్ఎస్​ ఫీజు వసూలు కాలేదు. నెట్​ కనెక్షన్, సర్వర్ సమస్య అలాగే ఉంది. దరఖాస్తుదారులు తమ సెల్​ ఫోన్​ లాగిన్ నుంచి రెగ్యులైజేషన్ పేమెంట్​ చేసే వీలున్నా వివరాల క్లారిఫికేషన్​తో పాటు రశీదు కోసం మున్సిపాలిటీలు, పంచాయతీ ఆఫీస్​లకు వెళ్తున్నారు.  

నిషేధిత సర్వే నంబర్లు మినహా..

ఎల్ఆర్ఎస్​ కోసం ప్రభుత్వం పెంచిన నెల రోజుల గడువును ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ  కోరారు. ఎఫ్​టీఎల్ నిషేధిత సర్వే నంబర్లు మినహా ఇతర జాగాలను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. రెగ్యులైజ్​ కాని ప్లాట్స్​లో నిర్మాణాలు అనుమతించడం కుదరదన్నారు.