తెలియకుండా కూతురు పెండ్లి చేస్తున్నరని... పోలీస్​స్టేషన్​లో నిప్పంటించుకున్నడు

మోపాల్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా మోపాల్​పరిధిలో తనకు తెలియకుండా తన భార్య కూతురి పెండ్లి చేస్తోందని ఓ వ్యక్తి పోలీస్​స్టేషన్​ఆవరణలో డీజిల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. మోపాల్​మండలం సింగంపల్లికి చెందిన రాజు(40), ఇతడి భార్య సునీతకు 23 ఏండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి 22 ఏండ్ల కూతురు, పన్నెండేండ్ల కొడుకు ఉన్నారు. రాజు, సునీతల మధ్య రెండేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. విసిగిపోయిన సునీత కూతురు, కొడుకును తీసుకొని నాలుగు నెలల కింద బీబీపేటలోని పుట్టింటికి వెళ్లింది.

 శుక్రవారం తన కూతురు పెండ్లి జరుగుతుందని, దీనిపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పోలీసులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరుతూ రాజు మోపాల్​ పోలీస్​స్టేషన్​కు వచ్చాడు. ఫిర్యాదు చేస్తే విచారిస్తామని పోలీసులు చెప్పారు. కంప్లయింట్​ తీసుకువస్తానని బయటకు వెళ్లిన రాజు, కొద్దిసేపటికి తిరిగి వచ్చాడు. వెంట తెచ్చుకున్న డీజిల్​ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు రాజును అడ్డుకొని మంటలార్పారు. అప్పటికే ఛాతి భాగం, చేతులు కాలాయి. రాజును జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ​హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​అందిస్తున్నారు.