- కుటుంబ సభ్యుల వినతితో చికిత్స చేయిస్తున్న రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి కోసం ఖతార్ వెళ్లిన ఓ వలస కార్మికుడు అనారోగ్యంతో అక్కడే కోమా స్థితిలోకి వెళ్లగా.. ఇటీవల ఇండియాకు తీసుకొచ్చారు. మొదట ప్రైవేట్‌లో చేర్పించగా.. అక్కడ వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో అతడిని నిమ్స్‌లో చేర్పించి, చికిత్స చేయిస్తునారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట కు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్యంతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. దీంతో అక్కడి కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈ నెల 1న ఖతార్ నుంచి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అయితే, ప్రైవేట్‌లో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తమకు లేదని, నిమ్స్ హాస్పిటల్ లో అడ్మిషన్ ఇప్పించి, ఉచిత వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి కి సాయన్న భార్య ప్రేమల, కుమారులు వికాస్, వినీత్ ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి ఎస్. వెంకట్రావు, సెక్షన్ ఆఫీసర్ ఇ. చిట్టిబాబు చొరవ తీసుకుని, నిమ్స్ లో అడ్మిషన్ కు అనుమతి మంజూరు చేయించారు.
ప్రస్తుతం సాయన్నకు నిమ్స్‌లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల గల్ఫ్, ఇతర దేశాల్లో పనిచేసే ప్రవాసీ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించినందున వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదని కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి పేర్కొన్నారు. ఖతార్ నుంచి అచేతన స్థితిలో స్వదేశానికి వచ్చిన పేద వలస కార్మికుడు సాయన్నను అక్కున చేర్చుకొని, నిమ్స్ లో చికిత్స అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.