నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 7న పోలింగ్
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
రేసులో కల్వకుంట్ల కవిత, సురేష్‌రెడ్డి, మండవ
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ బై ఎలక్షన్‌కు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు నుంచి మార్చి 19 వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. మార్చి 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 23 వరకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 7న పోలింగ్, 9న కౌంటింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరారనే కారణంతో నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోస్టు నుంచి రేకుల భూపతిరెడ్డి సస్పెండ్ అయ్యారు. దీంతో 2019 జనవరి 16 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. బై ఎలక్షన్‌లో గెలిచిన వాళ్లు 2022 జనవరి 4 వరకు పదవిలో కొనసాగుతారు. పాత నిజామాబాద్జిల్లా పరిధిలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటేయనున్నారు. వీళ్లలో మెజారిటీ టీఆర్ఎస్వాళ్లే కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాతో ఉంది.
ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్
పాత నిజామాబాద్ జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పేర్లను టీఆర్ఎస్హైకమాండ్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు రాజ్యసభ సీట్లకు క్యాండిడేట్లను కేసీఆర్ త్వరలోనే ఖరారు చేయనున్నారు. రాజ్యసభ సీటుకు పోటీ పడుతున్న వారిలో కవిత కూడా ఉన్నారు. రాజ్యసభ సీటు ఇవ్వకపోతే ఎమ్మెల్సీ సీటైనా ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పోస్టుపై మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి, పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావుకు టీఆర్ఎస్ హైకమాండ్హామీ ఇచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండటంతో సీనియర్‌నేతలు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
For More News..