
- 4.32 లక్షల ఎకరాల్లో వరి, 47 వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు
- సోయాబిన్ 37 వేల ఎకరాలు.. పసుపు 19 వేల ఎకరాల సాగు అంచనా
నిజామాబాద్, వెలుగు : వానకాలం పంటల సాగుకు సంబంధించి వ్యవసాయాధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. పంటల సాగుకు అనుగుణంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాల సరఫరాకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. సాగునీటి అవసరాలు, బోర్ల కింద పంటల సాగుకు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లాలో 5.44 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు.
మరింత పెరిగిన వరి సాగు..
వానకాలం సీజన్లో వరి సాగు 4.32 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని జిల్లాయంత్రాంగం భావిస్తుంది. గతేడాది వానకాలం 4.25 లక్షల ఎకరాలు సాగుకాగా, యాసంగిలో రికార్డు స్థాయిలో 4.19 లక్షల ఎకరాల్లో వరి పండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎస్పీకి అదనంగా రెండు సీజన్లలోనూ సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో వరి సాగు తర్వాత 47,678 ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో మొక్కజొన్న పంటలు వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆరుతడి పంటలు సాగుచేసే రైతులు వానకాలంలో 37,859 ఎకరాల విస్తీర్ణంలో సోయాబిన్ సాగు చేయనున్నట్లు జిల్లాయంత్రాంగం అంచనా వేసింది. గత వానకాలం సోయాబిన్ సాగు విస్తీర్ణం 29 వేల ఎకరాలు కాగా, ఈసారి మరింత పెరగనుందని భావిస్తుంది. 1,332 ఎకరాలు, కంది 855, వేరు శనగ 514, పెసర, మినుము ఇతర పంటలన్నీ కలిపి మరో 3,560 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు లెక్కలు వేశారు.
పసుపు విస్తీర్ణం తగ్గే చాన్స్..
పసుపు సాగులో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ఇందూర్ జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గేలా ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. కిందటేడు 21 వేల ఎకరాల్లో సాగైన పసుపు... ఈసారి 19,735 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. పసుపునకు ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.
సీడ్, యూరియా లెక్క తేల్చారు..
వరి పంటకు 1.30 లక్షల క్వింటాళ్ల సీడ్ కావాలని, మొక్కజొన్న విత్తనం 3,400 క్వింటాళ్లు, సోయాబిన్ 15,500 క్వింటాళ్లు, కంది పంటకు 58 క్వింటాళ్లు, మినుము 15 క్వింటాళ్లు, పెసర పంటకు 10 క్వింటాళ్ల సీడ్ అవసరమని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 18 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట సీడ్, 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 13,070 మెట్రిక్ టన్నుల డీఏపీ, 13,105 టన్నుల ఎంపీవో, 44,480 టన్నుల కాంప్లెక్స్, 1,452 టన్నుల ఎస్ఎస్పీ అవసరముందని సర్కార్కు రిపోర్టు పంపారు. జిల్లాలో ఎస్సారెస్పీ కింద 55 గ్రామాల్లోని 40,600 ఎకరాల ముంపు భూముల్లో పంటలు వేస్తున్నారు. సుమారు 19 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణల కింద ఉంది. ఇవి అధికారిక అంచనాల్లోకి రాకపోవడంతో సీజన్లో యూరియా, సీడ్ కొరత ఏర్పడనుంది.
పక్కా అంచనాలు
జిల్లాలోని వాతావరణం, సాగునీటి లభ్యత, రైతు ఆలోచనలు పరిగణలోకి తీసుకొని పంట అంచనాలు రెడీ చేశాం. సీజన్ అవసరాలు తీర్చేలా అంతా ప్లాన్ చేశాం. రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల సలహాలు తీసుకొని పంటలు సాగు చేయాలి.
వాజీద్ హుస్సేన్, డిప్యూటీ డైరెక్టర్, వ్యవసాయ శాఖ