సర్పంచులు తిరుగుబాటు చేయాలె :  ఎంపీ అర్వింద్​

జగిత్యాల, వెలుగు : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​పై సర్పంచులు తిరుగుబాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ఎంపీ నిధులతో చేపట్టిన అభివద్ధి పనులను ఎంపీ శుక్రవారం పరిశీలించారు. అనంతరం రాయికల్ మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు సుమారు 200 మంది బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం అర్వింద్​మాట్లాడుతూ.. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ పర్సంటేజీలు అడగడంతో పరిశ్రమలు పెట్టేందుకు ఇండస్ట్రీయలిస్టులు భయపడుతున్నారన్నారు.

కామారెడ్డిలో రైతులు ధర్నా నిర్వహిస్తే కలెక్టర్ ను బయటకు రావద్దని కేటీఆర్ ఫోన్ చేశాడని, ఇదా రైతు రాజ్యం అని ప్రశ్నించారు. 112 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో కేంద్రానికి నివేదిక అందజేస్తానని చెప్పారు. సర్పంచులకు కేంద్రం కేటాయించిన నిధులను బీఆర్ఎస్​మాయం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణరావు, బీజేపీ నియోజకవర్గస్థాయి లీడర్ పన్నాల తిరుపతి రెడ్డి, మండల లీడర్ పడాల తిరుపతి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.