- కోరుట్లపై ఎంపీ అర్వింద్ ఫోకస్
- ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు
- పసుపు, చెరుకు రైతుల ఓట్లపై ఆశలు
- ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ
మెట్‌పల్లి, వెలుగు : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ ప్రాంతం మీద బీజేపీకి మంచి పట్టు ఉండేది. అంతకుముందున్న మెట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ వరుస విజయాలు సాధించింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన తర్వాత ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో ఎక్కువగా పసుపు, చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి కంచుకోటగా మెట్‌పల్లి..
పాత మెట్‌పల్లి నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉండేది. 1985, 1989, 1994 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్ రావు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. 1998 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొమిరెడ్డి జ్యోతి గెలిచారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 1999లో ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. 2009లో మెట్‌పల్లి రద్దయి కోరుట్ల నియోజకవర్గం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడం, తెలంగాణ ఉద్యమం బలపడడంతో బీజేపీ క్రమంగా బలహీనపడింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి బీజేపీ పుంజుకుంది. ఎంపీగా అర్వింద్ గెలిచిన తర్వాత క్యాడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చారు. మెట్‌పల్లికి చెందిన ప్రముఖులు డాక్టర్ రఘు, మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. పార్టీని గతంలో మాదిరిగా పటిష్టం చేసేందుకు నాలుగేళ్లుగా ఆయన కృషి చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల మండలాల్లో కుల, యువజన, మహిళా సంఘాలతో టచ్‌లో ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆయా మండలాల్లో ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు.
పసుపు బోర్డు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ..
పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డును తీసుకొచ్చామని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తామన్న నినాదంతో ముందుకెళ్లాలని ఎంపీ అర్వింద్ భావిస్తున్నారు. నియోజకవర్గంలో పసుపు, చెరకు రైతులు సుమారు 80 వేల మంది వరకు ఉంటారు. ఇటీవల మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్లలో నిర్వహించిన సభల్లో పసుపు బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ అంశాలనే ఫోకస్ చేశారు. రైతు సంఘాల నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. దీంతో రైతులు బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. యువతలో అర్వింద్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, వారిని మరింతగా అట్రాక్ట్ చేయడంపై ఆయన దృష్టి పెడుతున్నారు.