మా వద్ద అయస్కాంతం ఉంది.. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఎంపీ అర్వింద్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. తమ వద్ద కూడా అయస్కాంతం ఉందని, దాంతో తప్పక తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాజకీయంలో మార్పునకు కోరుట్ల నియోజకవర్గం నాంది కాబోతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణకు సెంటర్ పాయింట్ కోరుట్ల అని అన్నారు. పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ గెలిచి తెలంగాణకే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామన్నారు.

రోడ్డు రోలర్ గుర్తుపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లి భంగపడ్డారని చెప్పారు. రోడ్డు రోలర్ గుర్తుకు, కారు గుర్తుకు తేడా తెలియడానికే కేసీఆర్ కు కంటి వెలుగు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి.. పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో 31 స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన తిండి లేదని, బాలికలకు ప్రత్యేకమైన వాష్​రూమ్స్​లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కల్వకుంట్ల వారంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే కోరుట్లలో కల్వకుంట్ల వారి పని పట్టడానికే నియోజకవర్గానికి వచ్చానని అన్నారు.

అంతకుముందు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పీబీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​హాజరయ్యారు. కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ అర్వింద్​కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.