నిజామాబాద్ కేంద్రంగా ప్రాంతీయ పసుపు బోర్డ్ ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. దీనిలోనే తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ కేంద్రాన్ని కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. నిజామాబాద్ కేంద్రంగా అన్ని రకాల సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడైనట్టు సమాచారం అందిందన్నారాయన.
ఈ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు న్యూ ఢిల్లీ.. లోధి ఎస్టేట్.. ఒబెరాయ్ హోటల్ లో పియూష్ గోయల్ ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేశారనీ… ఐతే చివరి నిమిషంలో ఆయన ప్రెస్ మీట్ రద్దయిందని అర్వింద్ చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు కేంద్రమంత్రికి సూచన చేశారనీ.. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిందని అర్వింద్ అన్నారు. త్వరలో నిజామాబాద్ పసుపు రైతుల కళ నెరవేరబోతోందని.. ఎన్నికల కోడ్ తర్వాత అధికారిక ప్రకటన వస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు.