నిజామాబాద్ రెవెన్యూ అధికారి ఇంట్లో.. గుట్టలుగా నోట్ల కట్టలు ఇలా

తెలంగాణ రాష్టం మొత్తం షాక్ అయ్యింది. ఓ మున్సిపల్ ఆఫీసులో పని చేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటం సంచలనంగా మారింది. ఏకంగా 7 కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్ము బయటపడటం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు దాసరి నరేందర్. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావటంతో.. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2024, ఆగస్ట్ 9వ తేదీ రోజంతా సోదాలు చేయగా.. ఏసీబీ అధికారులే షాక్ అయ్యే ఆస్తులు బయటపడ్డాయి. 

దాసరి నరేందర్ ఇంట్లో.. అతని బంధువుల ఇళ్లల్లో ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయల డబ్బు బయటపడింది. డబ్బును కట్టలు కట్టి.. గుట్టలుగా పెట్టాడు నరేందర్. ఈ నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యారు ఏసీబీ అధికారులు. అంతేనా.. దాసరి నరేందర్ బ్యాంక్ ఖాతాలో.. అక్షరాల కోటి 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంట్లోనే బీరువాల్లో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో.. దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు అక్షరాల 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని.. కేసు నమోదు చేశామని.. విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేసే ఓ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు.. అది కూడా నోట్ల కట్టలు దొరకటం.. ఆ ఫొటోలు వైరల్ కావటం విశేషం.