- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు : 2024 డిసెంబర్ లోగా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తామని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం బోధన్ సెగ్మెంట్ ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఎక్కడైనా ఇస్తున్నారా అని ఎంపీ అర్వింద్ ను ప్రశ్నించారు.
ఆగస్టు 15 లోగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డ జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలి
బాల్కొండ, వెలుగు : పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ సెగ్మెంట్ ముప్కాల్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
పార్లమెంట్ ఎన్నికల్లో మచ్చ లేని నాయకుడు జీవన్ రెడ్డి గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు గుడిసె అంజమ్మ, ఆమె భర్త నారాయణ, ముప్కాల్ మాజీ సింగిల్ విండో డెరైక్టర్ ఏలేటి రాజేశ్వర్, పోచంపాడ్ నుంచి 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ తాహర్ బిన్ హందాన్, అన్వేష్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.