- డైరెక్ట్‌గా ఎస్ఐల ఇసుక దందా
- హెచ్చార్సీని ఆశ్రయిస్తున్న బాధితులు
- మూడు నెలలుగా కొత్వాల్ పోస్టు ఖాళీ
నిజామాబాద్, వెలుగు: డిసిప్లెన్డిపార్ట్మెంట్గా పేరున్న పోలీసులు ఈ మధ్య కట్టు తప్పుతున్నారు. నిజామాబాద్‌లో చాలామంది పోలీసు అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్పవర్ను దుర్వినియోగం చేసి అక్రమవసూళ్లకు దిగడం.. బాధితులను వేధించడంలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
గతంలో పలువురు పోలీసు అధికారుల మీద అవినీతి ఆరోపణలు రాగా విచారణ జరిపించారు. ఈ విచారణలకు సంబంధించిన రిపోర్ట్లు కూడా బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తుంది. మూడు నెలలుగా పోలీసు కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల కిందిస్థాయి అధికారులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇసుక దందాలో ఎస్ఐ
ఇందల్వాయి ఎస్ఐ మనోజ్కుమార్డైరెక్ట్గా ఇసుకదందాలో ఇన్వాల్వ్ అయినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుకఅక్రమ రవాణాకు సహకారం ఇవ్వడమే కాక, బినామీ పేర్లతో టిప్పర్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారని లింగాపూర్ గ్రామస్తులు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి ఈనెల 2న కంప్లైంట్చేశారు. కోటగిరి ఎస్ఐ సందీప్ కూడా ఇసుక దందాకుఅండగా ఉంటున్నాడన్న ఆరోపణలు రాగా అతన్ని బాధ్యతల నుంచి తప్పించాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఆర్డర్ వచ్చి మూడునెలలైనా ఇంకా అమలు కావడంలేదు. బోధన్‌రూరల్, రెంజల్, ఎడపల్లి, నవీపేట, రుద్రూర్స్టేషన్లలో పోలీసులకు ఇసుక దందాతో సంబంధాలున్నట్టు ఉన్నతాధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్టులు వెళ్లాయి.
సీఐపై వేటు.. ఎస్ఐపై ఎంక్వైరీ
పోలీసుల ఆగడాలతో ఇబ్బందులు పడిన ఇద్దరు బాధితులు హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఒక సీఐ మీద వేటు వేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ సీఐ నవీన్, ఎస్.ఐ మల్లేశ్ తనను వేధిస్తున్నారని భీంగల్ టౌన్‌కు చెందిన సత్తెగంగయ్య హెచ్ ఆర్సీని ఆశ్రయించారు. కుటుంబకలహాల నేపథ్యంలో సత్తెగంగయ్య మెట్‌పల్లిలోని లాడ్జిలో ఉన్నాడు. ఈ సమాచారాన్ని భీమ్‌గల్ సీఐ, ఎస్ఐలు గంగయ్య ప్రత్యర్థులకు చెప్పారు. వారు అక్కడికి వెళ్లి దాడి చేయగా అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. చికిత్స తర్వాత కోలుకున్న సత్తెగంగయ్య హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై హెచ్ ఆర్సీ ఈ నెల 7నవిచారణ జరిపింది. దీంతో సీఐ నవీన్‌ను కమీషనరేట్‌కు అటాచ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్.ఐ మల్లేశ్ పై ఎంక్వైరీ నడుస్తోంది.కాలేజీ గొడవలకు సంబంధించి పదేపదే స్టేషన్ కు పిలిచి భయాందోళనకు గురిచేస్తున్నారంటూ నిజామాబాద్ నగరానికి చెందిన ఒక స్టూడెంట్ 5వ టౌన్ సీఐ సతీశ్, ఎస్.ఐ గంగాధర్‌లపై హెచ్ ఆర్సీ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హెచ్ ఆర్సీ నుంచి సీఐ, ఎస్ఐలకు నోటీసులు అందాయి. నిజామాబాద్‌కు చెందిన నగేశ్ అనే యువకుడు తనపై లేని కేసు బనాయించి జైలుకు పంపారని 2వ టౌన్ ఎస్.ఐ యాసర్ అరాఫత్, ఏఎస్ఐ లక్ష్మణ్‌నాయక్, ఎస్బీ కానిస్టేబుల్ సురేశ్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో లోకాయుక్త ముందు హాజరయ్యారు. తదుపరి విచారణ మార్చి 22కు వాయిదా పడింది. ట్రాక్టర్ లోన్ కట్టలేదన్న సాకుతో డౌరీ కేస్పెట్టి జైలుకు పంపుతామని భీమ్‌గల్ సీఐ, ఎస్ఐ బెదిరిస్తున్నారంటూ చేంగల్‌కు చెందిన నిఖేశ్ అనే వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో వైరలైంది.
ALSO READ : ఎయిర్పోర్ట్, టెక్స్టైల్ భూములకు.. రైతుబంధు కట్
బయటకు రాని రిపోర్ట్
డిసెంబర్12న రెంజల్ మండలం వీరన్నగుట్ట తండావాసి రెడ్యానాయక్ స్టేషన్లో చనిపోయారు. ఈ ఘటనపై మెదక్ జిల్లా తూఫ్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలోని విచారణ జరిగింది. ఈ విచారణ రిపోర్ట్ ఇప్పటికీ బయటకు రాలేదు.
సీపీ లేక మూన్నెళ్లు
నిజామాబాద్ పోలీసు కమిషనర్ లేక మూడు నెలలు గడిచింది. ఇంతవరకు కొత్త సీపీకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంతకుముందు సీపీగా ఉన్న కల్మేశ్వర్ సింగనెవార్ గత ఏడాది అక్టోబర్ 18న ట్రాన్స్ఫరై వెళ్లారు. అప్పటి నుంచి కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కమిషనరేట్‌లో మూడు కీలకమైన అదనపు డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమీషనరేట్ పరిధిలో 35 స్టేషన్లు, మహిళా, ట్రాఫిక్ ఠాణాలు ఉన్నాయి.రెగ్యూలర్ సీపీ లేకపోవడంతో పర్యవేక్షణ ఉండడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.