నిజామాబాద్, వెలుగు : కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కూతురితో పాటు ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసిన జనని (14) ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కోగా ఆమెను కాపాడేందుకు తండ్రి రాంచందర్‌రావు (40) ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన రాంచందర్‌రావు తన కూతురు జననితో కలిసి పర్భనీ ఎక్స్‌ప్రెస్‌లో బేగంపేట నుంచి బాసరకు ప్రయాణమయ్యారు.
వారి వెంట కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారు. నిజామాబాద్ స్టేషన్ లో వాటర్ బాటిల్ కొనడానికి జనని కిందకు దిగింది. కొద్ది సేపయ్యాక రైలు కదిలింది. దీంతో కంగారుపడిన జనని.. ఒక చేతిలో బాటిల్ పట్టుకొని కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలుజారి ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. గమనించిన ఆమె తండ్రి జననిని కాపాడే యత్నంలో ఆయన కూడా ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ రైల్వే పోలీసులు జీజీహెచ్ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు.