తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా సోకినట్లుగా వైద్యాధికారులు ఆదివారం నిర్ధరించారు. దీంతో ఎమ్మెల్యేను హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన సతీమణితో సహా మరో ముగ్గురికి కరోనా అని తేలడం తెలిసిందే. కాగా తాజాగా మరో ఎమ్మెల్యేకు సైతం కరోనా సోకడం కలకలం రేపుతుంది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయినట్టు తెలిసింది. అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్, భార్యకు నెగెటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.