
ధర్పల్లి, వెలుగు : అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలో 14.22 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, సబ్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. మండలంలోని రామడుగు, కేశారం, చల్లగర్గ, మైలారం, ధనంబండ తండా, రేకులపల్లి, దుబ్బాక గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిర్వహించారు. అనంతరం దుబ్బాక గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రైతు భరోసా, గృహలక్ష్మి, ఫ్రీ బస్సు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.లక్షల కోట్ల అప్పులనూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాని ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధనంబండ తండాలో రూ. 2.15 కోట్లతో సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, తండా పరిధిలోని గ్రామాలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్ పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, మిట్టాపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, పుప్పాల సుభాష్, చెలిమెల శ్రీనివాస్, సురేందర్ గౌడ్, అబ్దుల్ హామిద్, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్‌రెడ్డి(ఒన్నాజీపేట్), ఏఎంసీ డైరెక్టర్ మంగిత్యా, లాల్‌సింగ్, అధికారులు తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ, సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ, ఎంపీవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.