టర్మ్​ పొడిగింపుపై ​ఆశలు

టర్మ్​ పొడిగింపుపై ​ఆశలు
  • ఈ నెల 19తో  ముగియనున్న సింగిల్​ విండో పదవులు
  • డీసీసీబీ, ఐడీసీఎంఎస్ పదవులు కూడా.. 
  • ఎలక్షన్​ నిర్వహణ అనుమానమే

నిజామాబాద్, వెలుగు: సింగిల్​విండో పాలకవర్గాల ఐదేండ్ల పదవీ కాలం ఈ నెల 19తో ముగియనుండగా.. టర్మ్ పొడిగింపుపై ఆయా సొసైటీల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఆశలు పెట్టుకున్నారు.  గతేడాది అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో డీసీసీబీ, ఐడీసీఎంఎస్ పోస్టుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతల స్థానంలో కాంగ్రెస్ లీడర్లు పదవులు  దక్కించుకున్నారు.  అయితే వీరు పదవి చేపట్టి ఏడాది కూడా గడవక ముందే పాలకవర్గం పదవీ కాలం పూర్తి కానుండటంతో పొడిగిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

జిల్లాలో మొత్తం 89 సహకార సంఘాలున్నాయి. వీటికి 2020లో ఎన్నికలు నిర్వహించారు. ప్రతి సింగిల్ విండోకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లు ఉన్నారు.  విండో ప్రెసిడెంట్ల నుంచి డీసీసీబీ బ్యాంకుకు ఎన్నికైన 21 మంది డైరెక్టర్లు  బ్యాంకు చైర్మన్, వైస్​ చైర్మన్‌ను ఎన్నుకున్నారు.  

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  డీసీసీబీ బ్యాంకు వైస్​ చైర్మన్ గా అప్పటిదాకా కొనసాగిన కుంట రమేశ్ రెడ్డి అవిశ్వాస తీర్మానంతో 2024 మార్చిలో హస్తం పార్టీ తరఫున చైర్మన్‌గా ఎన్నికయ్యారు.   వైస్ చైర్మన్‌గా  శేఖర్ నవంబర్‌‌లో ఎలెక్ట్‌ అయ్యారు. ఐడీసీఎంఎస్​ చైర్మన్ పోస్టును గిరిజన వర్గానికి చెందిన తారాచంద్​నాయక్​ 2024  ఆగస్టులో దక్కించుకున్నారు.  వైస్​ పదవిలో ఇంద్రసేనారెడ్డి కంటిన్యూ అవుతున్నారు. ఎన్నికైన తక్కువ టైంలో పదవులు వదులుకోవడం ఇష్టంలేని నేతలు పదవీకాలం పొడిగింపును కోరుకుంటున్నారు. 

ఓటర్​ లిస్టు లేకపోవడంతో.. 

సింగిల్​విండోలకు ఎన్నికలు నిర్వహించాలంటే  పాలకుల పదవీ కాలం ముగియడానికి 45 రోజుల ముందే ఓటర్​ లిస్టు రూపొందించాలి.  కొత్తగా  రైతు సభ్యులుగా నమోదు చేసి ఓటరు లిస్టు ప్రిపేర్​ చేయాలి.  కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పదవీ కాలం పొడిగిస్తారని నేతలు ఆశగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరపకపోతే కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం.. ఇప్పుడున్న ప్రెసిడెంట్లను కొనసాగించవచ్చు. లేదా  పీఏసీఎస్​లో మెంబర్​షిప్​గల రైతుకు , లేదా ఆఫీసర్లనే పర్సన్ ఇన్ చార్జిలుగా నియమించవచ్చు.  వీటిలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరిలో టెన్షన్ నెలకొంది.

ఆర్డర్స్​ ప్రకారం ముందుకు వెళ్తం

ఈనెల 19తో సింగిల్​ విండో పాలకుల టర్మ్ ముగియనుంది.  డీసీసీబీ, ఐడీసీఎంఎస్ పోస్టులకు కూడా అదే ఆఖరు రోజు.  ఆ తర్వాత సర్కారు ఆదేశాలతో ముందుకు వెళతాం .  - శ్రీనివాస్​, డీసీవో