నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదంటూ ఓ విద్యార్థి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ యాదగిరి గౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం..నవీపేట్ మండలం నాగేపూర్‌కు చెందిన పులి సూర్య (16) నిజామాబాద్‌లోని ఓ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. అక్కడే ఎంసెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని కొద్దిరోజుల నుంచి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. వారు ఇప్పటికే ఫీజు కట్టామని, ఎలాగో కోచింగ్తీసుకుని ఎగ్జామ్ రాయమని, వస్తే వస్తుంది లేకపోతే లేదని సర్ది చెప్పారు. సోమవారం సూర్య తండ్రి శ్రీనివాస్ బర్త్‌డే ఉండడంతో ఆదివారం రాత్రి కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు.
అప్పుడు కూడా తనకు కోచింగ్ ఇష్టం లేదని చెప్పాడు. ‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేనేమోనని భయంగా ఉంది డాడ్..మీ గోల్నేను చేరుకోలేను’ అని బాధపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు సూర్యకు నచ్చజెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో సూర్య తండ్రి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తర్వాత కాలేజీకి వెళ్లాలని పేరెంట్స్ కోరడంతో తట్టుకోలేకపోయాడు. కోపంతో తల్లిని బైక్ తాళాలు అడిగి తీసుకుని వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్దగ్గరకు వెళ్తున్నాడేమో అనుకుని ఏమీ మాట్లాడలేదు.
కొద్దిసేపటికి అతడి స్నేహితులకు ఫోన్ చేయగా ఎవరూ తమ దగ్గరకు రాలేదని చెప్పారు. అనుమానంతో సూర్య తండ్రి గోదావరి దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ బైక్ కనిపించింది. చేపలు పట్టే మత్స్యకారులను అడగ్గా ఎవరో బ్రిడ్జిపై నుంచి దూకినట్టు అనిపించిందని చెప్పారు. గోదావరిలో గాలించగా డెడ్‌బాడీ దొరికింది. సూర్య తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.