- సొసైటీ స్కామ్ ఈ వేలంలో జరిగినా
- ఇంకా సొమ్ము రాలే..ఆందోళనలో బాధిత రైతులు
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన తాళ్లరాంపూర్ సొసైటీ స్కామ్ సొమ్ము రికవరీ ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించేందుకు సొసైటీ ఆస్తులు వేలం వేసి నాలుగు నెలలైనా బాధితుల ఖాతాలో ఇంకా డబ్బులు జమకాలేదు. ఓ వైపు సొమ్ము రికవరీలో జాప్యం.. మరోవైపు దోషులపై చర్యలు చేపట్టకపోవడం సొసైటీ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. అవకతవకలకు పాల్పడిన దోషులపై నివేదిక ఇచ్చి ఎడాదిన్నర కావస్తున్నా ఆఫీసర్లు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు టీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ సామ గంగారెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అనుచరుడు కావడంతో ఆఫీసర్లు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బయటకొచ్చింది ఇలా..
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీలో జరిగిన అవినీతిపై బాధితులు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ 2021 మే నెలలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసిన 75 రోజుల అనంతరం విచారణ చేపట్టారు. ఎంక్వైరీ ఆఫీసర్ సంఘ రికార్డులు పరిశీలించి, ఖాతాలను చెక్ చేసి ఆడిట్, బ్యాంక్ ఆఫీసర్లను విచారించి సహకార శాఖకు నివేదిక ఇచ్చారు. సొసైటీలో రూ.3.32 కోట్ల అవినీతి జరిగినట్లు తేల్చారు. దీనికి పాలకవర్గం చైర్మన్‌తో పాటు సీఈవోను బాధ్యులుగా చేస్తూ వీరిపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేయాలని సహకార శాఖ సర్కార్‌కు సిఫార్సు చేసింది. దీంతో పాటు సొసైటీలో ఆస్తులను వేలం వేసి డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన రూ.5.18 కోట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు ఆస్తులను వేలం కూడా వేశారు. అయితే ఈ భారీ మొత్తం రికవరీ చేయకుండా నిందితులు ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆస్తుల వేలం పాట
నిలిచిపోయింది.
ఈయన పేరు బద్దం భూమన్న. ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల వాసి అయిన ఈయన 2019లో తాళ్లరాంపూర్ సొసైటీలో రెండేళ్ల కోసం రూ.4 లక్షలు డిపాజిట్ చేశాడు. 2021 ఏప్రిల్ నెలతో డిపాజిట్ కాలపరిమితి ముగిసింది. అప్పటి పాలకవర్గం రూల్స్ అతిక్రమించి రుణాలు ఇవ్వడం.. సహకార శాఖ సొసైటీ ఆధ్వర్యంలో గోడౌన్లు , ఫంక్షన్ హాల్ నిర్మించడంతో సొసైటీ ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో భూమన్నకు డిపాజిట్ డబ్బులు చెల్లించలేదు. తర్వాత సొసైటీలో జరిగిన అక్రమాల నేపథ్యంలో డబ్బులు చెల్లింపులో మరింత జాప్యం జరిగింది. ఒక్క భూమన్నే కాదు దాదాపు సొసైటీలో ఉన్న డిపాజిట్ దారులంతా రెండేళ్లుగా తమ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
దోషులపై చర్యలేవి..?
సొసైటీలో రూ.3.32 కోట్ల అవినీతి జరిగిందని ఆఫీసర్లు నివేదిక ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా దోషులపై చర్యలు తీసుకోవడం లేదు. కాలయాపనతో దోషులను ప్రభుత్వమే కాపాడుతోంది. ఇప్పటికైనా వెంటనే యాక్షన్ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి.
- డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, బీజేపీ నేత
వచ్చే నెల చెల్లిస్తాం..
సొసైటీకి చెందిన రెండు ఆస్తుల వేలం ద్వారా రూ.5 కోట్లు వస్తున్నాయి. డిపాజిట్ దారులకు రూ.5.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగతా సొమ్మును కూడా రికవరీ ద్వారా సేకరించి వచ్చే డిపాజిట్ సొమ్మును చెల్లిస్తాం. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు.
- సింహాచలం, కోఆపరేటివ్ అధికారి
చెట్లను నరికితే క్రిమినల్ కేసులు
లింగంపేట, వెలుగు: పోడు పేరిట చెట్లను నరికే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాగిరెడ్డిపేట ఎఫ్‌ఆర్‌వో రవికుమార్ హెచ్చరించారు. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు పోడు భూముల కోసం అడవులను నరికేందుకు మంగళవారం సిద్ధపడగా అటవీ సిబ్బంది అడ్డుకుని అవగాహన కల్పించారు. 2005 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎఫ్‌ఆర్‌వో చెప్పారు. కానీ చాలా మంది రైతులు ఇప్పుడు జంగల్‌ను నరికి వేసి కబ్జాలో ఉంటే పట్టాలు ఇస్తారనే అపోహలో ఉన్నారన్నారు. ఇది కరెక్టు కాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై శంకర్, బీట్ ఆఫీసర్భూపతి, పోలీస్ సిబ్బంది
పాల్గొన్నారు.
25 మంది బైండోవర్
మండలంలోని ఒంటర్‌పల్లి, కొయ్య గుండు తండా, పర్మల్లతండా, నల్లమడుగు పెద్ద తండాలకు చెందిన 25 మందిని మంగళవారం తహసీల్దార్ మారుతి ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. వీరంతా ఇటీవల పోడు పేరిట అటవి భూముల కబ్జాలకు ప్రయత్నించడంతో ఫారెస్టు ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ఆలయ కమిటీచైర్మన్ల నియామకం
బోధన్, వెలుగు: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఆదివారం పట్టణంలో ఏకచక్రేశ్వర శివాలయం, మారుతి మందిరం, ఎడపల్లి మండలం జానక్కంపేట్‌లోని నర్సింహస్వామి దేవాలయాలకు కమిటీ చైర్మన్లను నియమించారు. ఏకచక్రేశ్వర శివాలయానికి బీర్కూర్ శంకర్, మారుతి మందిరానికి గుమ్ముల అశోక్‌రెడ్డి, నర్సింహస్వామి ఆలయానికి పురం సాయిలను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నేటి నుంచి కార్తీక పూజలు
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో బుధవారం నుంచి కార్తీక మాస పూజలు ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ముదిరెడ్డి విఠల్‌రెడ్డి తెలిపారు. మొదటి రోజు నాచారం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామిజీ రానున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకాలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మాసంలోని శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్‌ను కలసిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, వెలుగు: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్టీసీకి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్ గిర్ధావర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నరేంద్రబాబు, భవానీపేట్ సర్పంచ్ కృష్ణకాంత్ ఉన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన లీడర్లు
సిరికొండ, వెలుగు: మండలంలోని సర్పచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు టీఆర్ఎస్ లీడర్లు ఆర్టీసీ చైర్మన్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని బాజిరెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచులు రాజరెడ్డి, రమేశ్, గంగాదాస్, సరియా, సొసైటీ చైర్మన్ రాములు నాయక్, నరహరి నాయక్, మోజీరాం తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీ సభకు స్థల పరిశీలన
పిట్లం, వెలుగు: నవంబర్‌లో జిల్లాకు రానున్న రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర కోసం కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రావల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేదు. జిల్లాలో 65 కిలో మీటర్లు సాగే ఈ యాత్ర జుక్కల్ నియోజకవర్గం గుండా మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రూట్ పరిశీలన కోసం కాంగ్రెస్స్టేట్ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ఇప్పటికే రెండు దఫాలు వచ్చి పరిశీలించారు. రాహుల్ సభ కోసం మంగళవారం పీసీసీ సెక్రటరీ గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, జిల్లా మైనార్జీ మాజీ ప్రెసిడెంట్ జావిద్ అక్రం మద్నూర్వద్ద స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు.
మొక్కజొన్న, సోయా సెంటర్లు ఏర్పాటు చేయాలి
ఆర్మూర్, వెలుగు: మొక్కజొన్న, సోయాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బి.దేవారం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూర్‌లోని కుమార్ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం అక్టోబర్ 22 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదన్నారు.
పోలీసులు ప్రజలకు దగ్గర కావాలి
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: సమస్యల పరిష్కారాని కోసం పీఎస్‌కు వచ్చే ప్రజలకు పోలీసులు మరింత దగ్గర కావాలని సీపీ నాగరాజు సూచించారు. మంగళవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నవంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సంప్రదాయాలను పాటించాలి
నిజామాబాద్, వెలుగు: హిందువులు తమ సంప్రదాయాలను పాటించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం 5వ డివిజన్ పరిధిలోని బోర్గాం (పి) గ్రామంలో జరిగిన బీరప్ప వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్ద కురుమ ఇంటి నుంచి బీరప్ప స్వామి, కామరతి, అక్క మహంకాళి విగ్రహాలను పల్లకీలో ఊరేగించారు. అనంతరం బ్యాంక్ కాలనీలోని బీరప్ప ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధన్‌పాల్ చీఫ్ గెస్ట్ పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బీరప్ప యూత్ అధ్యక్షుడు దశరథ్, కార్యవర్గ సభ్యులు, కురుమ సంఘం సభ్యులు ఉన్నారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో
మెండోరా, వెలుగు: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 74 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 18 గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 62,400 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 4 వేలు, కాకతీయ కాల్వకు 4 వేలు, వరద కాల్వకు 3 వేలు, లక్ష్మి కాల్వకు 200, సరస్వతి కాల్వ 100 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్‌లోకి 566.304 టీఎంసీల వరద వచ్చి చేరగా 496.059 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలినట్లు చెప్పారు.
మన్మథస్వామి ఆలయానికి పాదయాత్ర
బోధన్, వెలుగు: పట్టణంలోని భక్తులు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కఫిల్దార్లోని మన్మథస్వామి దేవాలయానికి మంగళవారం పాదయాత్రగా బయలుదేరారు. బోధన్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ పాదయాత్ర ప్రారంభించారు. బోధన్ నుంచి నాగన్‌పల్లి, సాలూర, హున్సా, సుంకిని మీదుగా మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ప్రతి ఏటా ఈ పాదయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ని, వెలుగు: తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ని శశిరేఖ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మండలంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు బిల్లుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా బాన్సువాడకు 10 వేల ఇండ్లు మంజూరు చేసుకున్నామన్నారు. ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసమే రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రుద్రూర్ మండలానికి 873 ఇండ్లు మంజూరు చేసినట్లు స్పీకర్ చెప్పారు. ఈ సీజన్ వడ్ల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వడ్లను అమ్మాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డోవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్ కుమార్, ఏఈ నాగేశ్వరరావు, జడ్పీటీసీ నారోజి గంగారం, ఎంపీపీ సుజాత నాగేందర్, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, మహ్మద్ పాల్గొన్నారు.
పేకాడుతున్న 587 మందిపై కేసు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: జిల్లాలోని పలు పేకాట స్థావరాలపై దాడులు జరిపారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు దాడులు జరిపి 100 కేసులు నమోదు చేసి, 587 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల 8 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పేకాటను నియంత్రించడానికి ప్రత్యేక టీంతో పాటు, కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు.
కామారెడ్డిలో 106 మంది..
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి పలు చోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేసి 106 మందిని పట్టుకున్నట్లు ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి నుంచి రూ.1,10,270లను స్వాధీనం చేసుకుని, 21 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. దేవునిపల్లి, భిక్కనూరు, గాంధారి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్ పీఎస్ పరిధిలో దాడులు నిర్వహించారు.
వర్ని హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలి
వర్ని,వెలుగు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆధునికీకరించాలని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాస్పిటల్ స్లాబ్ పూర్తిగా ధ్వంసం కావడంతో వర్షం పడినప్పుడు కురుస్తోందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సాయిబాబు, సురేశ్ పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వడ్లను కేంద్రాలకు తేవాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,060 మద్దతు ధర ఇస్తు న్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, విండో డైరెక్టర్లు రాజిరెడ్డి, కృష్ణవేణి, సీఈవో పవన్‌కుమార్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సిరికొండ, వెలుగు: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ధర్పల్లి జట్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని కొండాపూర్, తూంపల్లి, పాకాల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సంపగి జమున రూ.12 వేలు, గున్నాల శ్రీనివాస్‌గౌడ్ రూ.60 వేలు, ఒరగంటి కవిత రూ.21 వేలు, వేణు గోపాల్ రూ.54 వేలు, వర్షిణికి రూ.12 వేలు, సాయిలు రూ.24 వేలు, బాదావత్ సరితకు రూ.1.50 లక్షల చెక్కులను అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా ఆదుకోలేవని జగన్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు ఆకుల తిర్మల్, సర్పంచులు పాల్గొన్నారు.